శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Sep 24, 2020 , 16:04:07

దిగ్గజ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ కన్నుమూత

దిగ్గజ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ కన్నుమూత

ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత‌ డీన్‌ జోన్స్‌(59) కన్నుమూశారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న జోన్స్‌కు గురువారం గుండెపోటు రావడంతో చనిపోయారు.  యూఏఈ వేదికగా జరుగుతున్న  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో బ్రాడ్‌కాస్టర్‌  స్టార్‌ స్పోర్ట్స్‌ తరఫున   వ్యాఖ్యానం చేసేందుకు ఆయన భారత్‌కు వచ్చారు. ముంబైలోని ఓ హోటల్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. స్టార్‌స్పోర్ట్స్‌ కామెంటరీ బృందంలో ఉన్న జోన్స్‌ ప్రస్తుతం ముంబైలోని స్టార్‌ హోటల్‌లో బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉంటున్నారు. 

1984 నుంచి 1992 మధ్య ఎనిమిదేండ్ల పాటు అంతర్జాతీయ  క్రికెట్లో  ఆస్ట్రేలియాకు   ప్రాతినిధ్యం వహించాడు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో  ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడాడు.  టెస్టుల్లో 46.11 సగటుతో 3,631 పరుగులు సాధించాడు. అందులో 11 శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి.  వన్డేల్లో 44.61 సగటుతో 6,068 రన్స్‌ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 శతకాలు, 46 హాఫ్‌సెంచరీలు సాధించాడు. 

 'ప్రొఫెసర్‌ డీనో'గా పేరుగాంచిన విక్టోరియా బ్యాట్స్‌మన్‌ జోన్స్‌ ఓపెనర్‌గా  ఎటాకింగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌తో అలరించాడు. 245 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జోన్స్‌ 19,188 రన్స్‌ సాధించడం విశేషం. మెల్‌బోర్న్‌లో జన్మించిన జోన్స్‌..ప్రపంచవ్యాప్తంగా తన కామెంటరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. భారత మీడియా రంగంలోనూ ఆయన ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు.