సిడ్నీ: తనను కిడ్నాప్ చేసిన మూడు నెలల తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ ఆ ఘటనపై స్పందించాడు. ఈ విషయంలో తానేమీ తప్పు చేయలేదని అతడు స్పష్టం చేశాడు. 50 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్‌ను ఏప్రిల్ 14వ తేదీన సిడ్నీలో కొందరు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతన్ని గన్‌తో బెదిరించి, కొట్టి గంట తర్వాత వదిలేశారు. ఈ కిడ్నాప్ ఘటన గురించి గత నెలలోనే పోలీసులు వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ కూడా చేశారు. ఆ నలుగురిలో మెక్‌గిల్ పార్ట్నర్ సోదరుడు మారియా ఓమీగర్ కూడా ఉన్నాడు. అయితే ఇన్నాళ్లూ తన కిడ్నాప్‌పై సైలెంట్‌గా ఉన్న మెక్‌గిల్.. మంగళవారం నోరు విప్పాడు.
నేనేమీ తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను, పోలీసులు చెప్పేది తప్పని ఎవరైనా అనుకుంటే ఇక వాళ్లిష్టం అని మెక్‌గిల్ అన్నాడు. తనను కిడ్నాప్ చేసే ముందు తన పార్ట్నర్ సోదరుడైన మారియా ఓమీగర్ను ఓ డ్రగ్ డీలర్‌కు మెక్‌గిల్ పరిచయం చేశాడని పోలీసులు చెప్పారు. సిడ్నీలోని ఓ రెస్టారెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మెక్‌గిల్.. ఇలా ఎవరో ఒకరితో తాము కలుస్తూ ఉండటం ఎప్పుడూ జరిగేదని అన్నాడు. ఈ ఘటనలో తాము ఏమీ చేయలేదని అతడు మరోసారి స్పష్టం చేశాడు. ఈ నెలలోనే ఆ రెస్టారెంట్ కూడా మూతపడింది. తన స్నేహితులే తనను మోసం చేశారని మెక్‌గిల్ వాపోయాడు.