మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 12, 2020 , 00:04:27

‘ఫైనల్‌' గొడవపై ఐసీసీ చర్యలు

‘ఫైనల్‌' గొడవపై ఐసీసీ చర్యలు
  • ముగ్గురు బంగ్లా, ఇద్దరు భారత ఆటగాళ్లకు డీ మెరిట్‌ పాయింట్లు కేటాయింపు

దుబాయ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ అనంతరం చోటుచేసుకున్న ఘటనపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఆదివారం భార త్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన ఫైనల్లో విజయం సాధించిన బంగ్లా ఆటగాళ్లు.. హద్దుమీరి సంబురాలు జరుపుకున్న విషయం తెలిసిందే. లక్ష్యాన్ని ఛేదించిన వెంటనే మైదానంలోకి దూసుకొచ్చిన బంగ్లా ప్లేయర్లు.. భారత ఆటగాళ్ల వద్దకు వచ్చి వారిని రెచ్చగొట్టి గొడవకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ విచారణ చేపట్టి ఐదుగురు ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన తౌహిద్‌, షమీమ్‌, రకీబుల్‌తో పాటు.. భారత్‌కు చెందిన ఆకాశ్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ ఉన్నారు. ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వీరిపై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 


బంగ్లా ఆటగాళ్లు తౌహిద్‌కు 10, షమీమ్‌కు 8, రకీబుల్‌ హసన్‌కు 5 డీ మెరిట్‌ పాయింట్లు విధించిన ఐసీసీ.. భారత పేసర్‌ ఆకాశ్‌ సింగ్‌పై 8 సస్పెన్షన్‌ పాయింట్లు (6 డీ మెరిట్‌ పాయింట్లకు సమానం), లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు 7 డీ మెరిట్‌ పాయింట్లు కేటాయించింది. మ్యాచ్‌ సందర్భంగా బంగ్లా బ్యాట్స్‌మన్‌ అవిషేక్‌ దాస్‌ను ఔట్‌ చేసిన తర్వాత అసభ్య పదజాలంతో అతడిని సాగనంపినందుకుగానూ రవికి 5 డీ మెరిట్‌ పాయింట్లు కేటాయించిన ఐసీసీ.. ఆ తర్వాత జరిగిన గొడవలో పాలుపంచుకున్నందుకు 2 డీ మెరిట్‌ పాయింట్లు విధించింది. మ్యాచ్‌ రిఫరీ గ్రేమ్‌ లాబ్రోయ్‌ ముందు ఆటగాళ్లంతా తమ తప్పు ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ లేకుండానే ఈ చర్యలు తీసుకున్నది. యువ ఆటగాళ్లకు కేటాయించిన డీ మెరిట్‌ పాయింట్లు 24 నెలల పాటు వారి ఖాతాలో కొనసాగనున్నాయి. ఈ రెండేండ్ల వ్యవధిలో వారు మరోసారి నియమావళిని ఉల్లంఘిస్తే.. మ్యాచ్‌ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


logo
>>>>>>