మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 00:37:33

ప్రపంచ చాంప్‌కు భారత్‌ షాక్‌

ప్రపంచ చాంప్‌కు భారత్‌ షాక్‌
  • 2-1తో బెల్జియంను చిత్తు చేసిన మన్‌ప్రీత్‌ సేన
  • ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌

భువనేశ్వర్‌: భారత హాకీ జట్టు అదరగొట్టింది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌లో ప్రపంచ చాంపియన్‌ బెల్జియంపై జయభేరి మోగించి వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన మన్‌ప్రీత్‌ సేన.. శనివారం  కళింగ స్టేడియంలో జరిగిన పోరులో 2-1తో బెల్జియంపై గెలుపొందింది. భారత్‌ తరఫున మన్‌దీప్‌ సింగ్‌ (2వ ని.లో), రమణ్‌దీప్‌ సింగ్‌ (47వ ని.లో) చెరో గోల్‌ సాధించగా.. బెల్జియం తరఫున గాథియర్‌ (33వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. ఈ గెలుపుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నాలుగో స్థానానికి చేరనుంది. కొత్త ర్యాంకింగ్స్‌ విధానాన్ని (2003లో) ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్‌. బెల్జియంపై మన జట్టుకిది 50వ విజయం కావడం విశేషం. 


మ్యాచ్‌ ఆరంభమైన రెండో నిమిషంలోనే భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. అరంగేట్ర ఆటగాడు రాజ్‌కుమార్‌ అందించిన పాస్‌ను చేజిక్కించుకున్న దిల్‌ప్రీత్‌ సింగ్‌ నేరుగా ప్రత్యర్థి పోస్ట్‌లోకి కొట్టగా.. బెల్జియం గోల్‌ కీపర్‌ బంతిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో గోల్‌ పోస్ట్‌ పక్కనే కాచుకొని ఉన్న మన్‌దీప్‌ బంతిని నెట్‌లోకి చేర్చి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. ఇక అక్కడి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్లిన భారత్‌.. అద్వితీయమైన డిఫెన్స్‌తో కట్టిపడేసింది. ముఖ్యంగా గోల్‌ కీపర్లు పీఆర్‌ శ్రీజేశ్‌, కృషణ్‌ పాఠక్‌ అడ్డుగోడలా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. మూడో క్వార్టర్‌లో బెల్జియం స్కోరు సమం చేసినా.. ఆ వెంటనే రమణ్‌దీప్‌ గోల్‌తో భారత్‌ మ్యాచ్‌ను ముగించింది. ఇరు జట్లు నేడు మరోమారు తలపడనున్నాయి.


logo