ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 15, 2020 , 13:42:05

భారత బౌలర్లు సక్సెస్‌..ఓపెనర్లు అదుర్స్‌

భారత బౌలర్లు సక్సెస్‌..ఓపెనర్లు అదుర్స్‌

న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత పేసర్లు అదరగొట్టారు.

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత పేసర్లు అదరగొట్టారు. పర్యాటక పేసర్ల ధాటికి ఆతిథ్య  ఎలెవన్‌ జట్టు 74.2 ఓవర్లలో 235 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర(34), హెన్రీ కూపర్‌(40), టామ్‌ బ్రూస్‌(31), డారిల్‌ మిచెల్‌(32) అంతంతమాత్రంగానే రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ(3/17), ఉమేశ్‌ యాదవ్‌(2/49), బుమ్రా(2/18), సైనీ(2/58) విజృంభించడంతో కివీస్‌ ఎలెవన్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. వన్డే సిరీస్‌లో తేలిపోయిన బుమ్రా వామప్‌ మ్యాచ్‌తో ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.  

కివీస్‌ ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చిన ఓపెనర్లు పృథ్వీ షా(35), మయాంక్‌ అగర్వాల్‌(23) దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ 87 పరుగుల ఆధిక్యంలో ఉంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. యువ క్రికెటర్‌ హనుమ విహారి(101), పుజారా(93) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు.  

logo