శనివారం 28 మార్చి 2020
Sports - Jan 27, 2020 , 00:30:36

గాఫ్‌ పోరు ముగిసె

గాఫ్‌ పోరు ముగిసె

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించాలనుకున్న కోరీ గాఫ్‌ ఆశ ఈ సారికి నెరవేరలేదు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒసాకను ఓడించి సంచలనం సృష్టించిన 15 ఏండ్ల అమెరికా యువ సంచలనం ప్రిక్వార్టర్స్‌లోనే పరాజయం పాలై కన్నీటితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాప్‌ సీడ్‌, లోకల్‌ స్టార్‌ బార్టీ, ఐదో సీడ్‌ క్విటోవా క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ ముందడుగేయగా.. 12వ సీడ్‌ ఫొగ్నినికి వందో ర్యాంకు ఆటగాడు సాండ్‌గ్రెన్‌ షాకిచ్చాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న క్వార్టర్స్‌ చేరితే.. లియాండర్‌ పేస్‌ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.

  • ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైన అమెరికా టీనేజర్‌
  • క్వార్టర్స్‌లోకి జొకోవిచ్‌, ఫెదరర్‌

మెల్‌బోర్న్‌: తొలి రౌండ్‌లో వీనస్‌ విలియమ్స్‌ను ఓడించి, మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒసాకను మట్టికరిపించిన పదిహేనేండ్ల కోకో గాఫ్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న సమయంలో తొలి సెట్‌ గెలిచాక కూడా పరాజయం పాలవడంతో గాఫ్‌ కోర్టులోనే కన్నీటి పర్యంతమైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గాఫ్‌ 7-6 (7/5), 3-6, 0-6తో అమెరికాకే చెందిన 14వ సీడ్‌ సోఫియా కెనిన్‌ చేతిలో ఓడింది. 2 గంటల 9 నిమిషాల పాటు సాగిన పోరులో.. ఆరంభంలోనే సర్వీస్‌ బ్రేక్‌కు గురైనా గాఫ్‌ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వెంటనే పుంజుకొని హోరాహోరీగా పోరాడింది. ఇద్దరు ప్లేయర్లు ఎక్కడా తగ్గకుండా ఆడడంతో సెట్‌ టై బ్రేకర్‌కు చేరింది. అక్కడా సత్తాచాటి బలమైన షాట్లతో విరుచుకుపడిన ప్రపంచ 66వ ర్యాంకర్‌ గాఫ్‌.. తొలిసెట్‌ కైవసం చేసుకుంది. ప్రత్యర్థి సోఫియా దూకుడుతో రెండో సెట్‌లో ఆమె చతికిలబడింది.  నిర్ణయాత్మక సెట్‌లో గాఫ్‌ పూర్తిగా చేతులెత్తేసింది. కీలక సమయాల్లో తప్పిదాలు చేసి సర్వీస్‌లను సైతం కాపాడుకోలేకపోయింది. 


బార్టీ, క్విటోవా ముందంజ 

మరో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ అష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-3, 1-6, 6-4తో అలీసన్‌ రిస్కే (అమెరికా)పై గెలిచింది. ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-7 (4/7), 6-3, 6-2తో మారియా సక్కరి (గ్రీకు)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో బార్టీ-క్విటోవా తలపడనున్నారు. కాగా, అన్‌సీడెడ్‌ ఓన్స్‌ జాబేర్‌(ట్వునిషియా) 7-6 (7/4), 6-1తో 27వ సీడ్‌ వాంగ్‌ క్వింగ్‌ (చైనా)కు షాకిచ్చి, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్స్‌ చేరిన తొలి అరబ్‌ మహిళగా చరిత్ర సృష్టించింది.


క్వార్టర్స్‌లో ఫెదరర్‌, జొకోవిచ్‌ 

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో స్విస్‌ దిగ్గజం, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు రోజర్‌ ఫెదరర్‌ 4-6, 6-1, 6-2, 6-2తో మార్టన్‌ ఫక్సోవిక్స్‌ (హంగేరీ)పై గెలిచాడు. ఫెడ్‌కు ఇది 57వ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ కాగా ఆస్ట్రేలియాలో 15వది. 12వ సీడ్‌ ఫాబియో ఫొగ్నిని (ఇటలీ)కి 7-6 (7/5), 7-5, 6-7 (2/7), 6-4తేడాతో షాకిచ్చిన సాండ్‌గ్రెన్‌ (అమెరికా)తో రోజర్‌ తదుపరి పోరులో మంగళవారం తలపడనున్నాడు. రెండో సీడ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6-3, 6-4, 6-4తో డీగో స్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా)పై వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో మిలోస్‌ రొయానిక్‌ (కెనడా) 6-4, 6-3, 7-5తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ నాదల్‌.. కైర్గియోస్‌ (అమెరికా) మధ్య సోమవారం మ్యాచ్‌ జరుగనుంది.


క్వార్టర్స్‌లో బోపన్న, రెండో రౌండ్‌కు పేస్‌ 

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత సీనియర్‌ ప్లేయర్లు లియాండర్‌ పేస్‌, రోహన్న బోపన్న జోడీలు ముందడుగేశాయి. నాదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి రెండో రౌండ్లో బరిలోకి దిగిన బోపన్న 6-4, 7-6 (7/4)తో నికోల్‌ మెలిచర్‌-బ్రూనో సోర్స్‌పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో భారత సీనియర్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌-ఓస్టపెంకో (లాత్వియా) జోడీ 6-7 (4/7), 6-3,10-6తో స్టామ్‌ సాండెర్స్‌-మార్క్‌ పోల్‌మన్స్‌ ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది తర్వాత ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన పేస్‌కు ఇదే చివరి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ.


logo