శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 19, 2020 , 18:31:06

ధోనీకి వీడ్కోలు మ్యాచ్.. బీసీసీఐ వద్ద ప్లాన్ బీ కూడా రెడీ!

ధోనీకి వీడ్కోలు మ్యాచ్.. బీసీసీఐ వద్ద ప్లాన్ బీ కూడా రెడీ!

ముంబై : అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ జరిపేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ధోనీకి వీడ్కోలు మ్యాచుతో వీడ్కోలు పలుకాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి మొదలుకొని మహి అభిమానులు కూడా కోరుతున్నారు. అయితే, ధోనీ మాత్రం వీడ్కోలు మ్యాచుకు ససేమిరా అంటుండటంతో.. ప్లాన్ బీ అమలు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

ధోనీ గత ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ 20 వరల్డ్ కప్ టోర్నీ వాయిదా పడటంతో మరో చర్చకు అవకాశం లేకుండా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. ధోనీ నిర్ణయం వెలువడిన గంట తర్వాత మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను పెంచుకున్న ధోనీ సాదాసీదాగా ఆట నుంచి తప్పుకోవడం చాలా మందికి నచ్చడం లేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటుచేయాలని కోరారు. ధోని వీడ్కోలు మ్యాచ్ ధోనీ ఇంటి స్టేడియం ఉన్న రాంచీలోనే జరగాలని ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ఇదే అతడికి ఇచ్చే నిజమైన గౌరవమన్నారు.

"ప్రస్తుతం భారత జట్టుకు అంతర్జాతీయ సిరీస్ ఏదీ లేదు. ఐపీఎల్ తరువాత మేము ఏదైనా చేయగలం. దేశం కోసం చాలా చేసిన ధోనికి సరైన గౌరవం లభించాల్సిందే. ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఉండాలని మేమూ కోరుకుంటున్నాం. కాని ధోని వేరే రకమైన ఆటగాడు. అతను అకస్మాత్తుగా పదవీ విరమణ ప్రకటించాడు. ఇంత త్వరగా అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోలేరు'' అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. వీడ్కోలు మ్యాచ్ కోసం ధోనితో బోర్డు మాట్లాడుతుందని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించకపోతే గౌరవ వేడుక నిర్వహించేందుకు మా దగ్గర ప్లాన్ బీ రెడీ గా ఉన్నదని ఆయన వెల్లడించారు. 

ఒక గొప్ప ఆటగాడిని ఇలా వెళ్లనివ్వలేరు: మదన్ లాల్

భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా లెజెండ్ వికెట్ కీపర్ ధోనీ గౌరవ వేడుకను నిర్వహించడం గురించి మాట్లాడారు. "ధోని కోసం బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్ జరిపితే చాలా సంతోషిస్తాను. అతను గొప్ప ఆటగాడు. మీరు అతన్ని ఇలా వెళ్ళనివ్వలేరు. మాహి అభిమానులు అతడిని మళ్లీ ఆడాలని కోరుకుంటారు" అని మదన్ లాల్ అన్నారు.


logo