సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 08, 2020 , 12:14:49

కివీస్‌ సవాల్‌కు సిద్ధం

కివీస్‌ సవాల్‌కు సిద్ధం

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటన అంత సులువు కాదని, అయితే ఆ సవాలుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఈ నెల చివర్లో న్యూజిలాండ్‌కు వెళ్లనున్న భారత్‌ ఆ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి పొందిన రోహిత్‌.. కివీస్‌ పర్యటనపైనే పూర్తి దృష్టిసారించిన నేపథ్యంలో మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘న్యూజిలాండ్‌ గడ్డపై క్రికెట్‌ ఆడడం అంత సులువు కాదు. చివరిసారి మేం టెస్టు సిరీస్‌(0-1) కోల్పోయినా మంచి పోరాటం కనబరిచాం. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పటి భారత బౌలింగ్‌ దళం పూర్తి విభిన్నంగా ఉంది. వ్యక్తిగతంగా కివీస్‌ పర్యటన నాకు చాలెంజ్‌. కొత్త బంతిని ఎదుర్కోవడం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంత సులువు కాదు. విదేశాల్లో మరింత కష్టం. అయితే దక్షిణాఫ్రికాతో పుణెలో జరిగిన రెండో టెస్టులో బంతి ఎక్కువగా స్వింగ్‌ అయింది.

భారత్‌లో అంత స్వింగ్‌ నేనెప్పుడూ చూడలేదు’ అని రోహిత్‌ చెప్పాడు. కివీస్‌ బౌలర్లు పక్కా ప్రణాళికను రచించుకొని దానికే కట్టుబడతారని, అందుకే ఆ జట్టు బౌలింగ్‌ పటిష్ఠంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. గతేడాది మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా 2442 పరుగులు చేసి రికార్డు సృష్టించడంపైనా హిట్‌మ్యాన్‌ మాట్లాడాడు. ‘ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ జట్టుగా సాధిస్తున్న విజయాల పట్ల సంతోషంగా ఉన్నా. ఆ రికార్డు మంచిదే... కానీ ప్రతి సిరీస్‌ గెలువడంపైనే మేం దృష్టిసారిస్తాం. బాగా ఆడితే, ఆ ప్రయాణంలో రికార్డులు వాటంతటికవే వస్తుంటాయి’ అని రోహిత్‌ శర్మ చెప్పాడు. అలాగే నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ బాగా ఆడుతున్నాడని, విండీస్‌ సిరీస్‌తో పంత్‌ సైతం గాడిలో పడ్డాడని అభిప్రాయపడ్డాడు. ఇక రిటైర్మెంట్‌ ఆరేండ్ల తర్వాత ఏడేండ్ల తర్వాత అని ప్రస్తుతం ఆలోచించడం లేదని, గెలవాల్సిన ప్రపంచకప్‌లు చాలా ఉన్నాయని రోహిత్‌ అన్నాడు.

ముంబై జట్టుతో రోహిత్‌ ముచ్చట్లు

రంజీల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై జట్టు ఆటగాళ్లతో రోహిత్‌ ముచ్చటించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఆడాలన్న దానిపై ప్లేయర్లకు రోహిత్‌ సూచనలు చేశాడని సమాచారం. రైల్వేస్‌, కర్ణాటక జట్ల చేతిలో ముంబై వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన సంగతి తెలిసిందే.


logo