మంగళవారం 26 జనవరి 2021
Sports - Jan 06, 2021 , 01:31:34

కూర్పు కోసం కసరత్తు..

కూర్పు కోసం కసరత్తు..

  • మయాంక్‌ స్థానంలో రోహిత్‌!
  • శార్దుల్‌, సైనీ మధ్య పోటీ 
  • మూడో టెస్టు కోసం భారత్‌ సన్నద్ధం 

సిడ్నీ: రెండో టెస్టులో విజయం అనంతరం కావాల్సినంత విశ్రాంతి తీసుకున్న భారత జట్టు.. సిడ్నీ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడో టెస్టు  కోసం సన్నద్ధమవుతున్నది. మెల్‌బోర్న్‌ నుంచి సోమవారమే సిడ్నీకి చేరిన రహానే సేన మంగళవారం జోరుగా ప్రాక్టీస్‌ చేసింది. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్‌ జట్టుతో చేరడం టీమ్‌ఇండియా బలం పెంచే విషయం కాగా.. గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో అతడు బరిలో దిగడం ఖాయమే. మెల్‌బోర్న్‌లో ఆకట్టుకున్న గిల్‌ అతడితో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. ఆ తర్వాత పుజారా, రహానే, విహారి, పంత్‌ బ్యాటింగ్‌కు రానున్నారు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండటంతో జడేజా, అశ్విన్‌ ఉండటం పక్కా. 

సైనీనా.. శార్దూలా?

స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా.. రెండో టెస్టులో గాయపడ్డ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం పిచ్‌పై కవర్స్‌ కప్పి ఉంచడంతో జట్టు కూర్పుపై అంచనా కష్టంగా మారింది. పిచ్‌పై తేమ ఉంటే శార్దుల్‌కు అవకాశం దక్కొచ్చు. బంతిని స్వింగ్‌ చేయగల సత్తాతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగల సత్తా ఠాకూర్‌ సొంతం. అలా కాకుండా ఫ్లాట్‌ పిచ్‌ అయితే మాత్రం నిలకడగా గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేయగల సైనీ వైపు మొగ్గుచూపొచ్చు. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో సత్తాచాటి సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికైన నటరాజన్‌తో అరంగేట్రం చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సోమవారం టెస్టు డ్రెస్‌లో ఫొటోసెషన్‌లో పాల్గొన్న యార్కర్‌ కింగ్‌ నట్టూ.. ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ముగ్గురిలో ఎవరు ఆడినా వారికి అరంగేట్రమే. సైనీ, నటరాజన్‌ ఇంత వరకు టెస్టు బరిలోదిగలేదు. శార్దుల్‌ రెండేండ్ల క్రితం తొలి మ్యాచ్‌ ఆడినా మొదటి ఓవర్‌ పూర్తి చేయకముందే గాయం కారణంగా దూరమయ్యాడు.

వార్నర్‌ పునరాగమనం..

రెండో టెస్టులో ఓటమిపాలైన ఆసీస్‌ జట్టు.. శక్తియుక్తులను కూడగట్టుకొని సిడ్నీ టెస్టు కోసం రెడీ అవుతున్నది. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన ఓపెనర్లు వార్నర్‌, పుకోస్కీ తిరిగి జట్టులోకి రానుండటం కంగారూలకు శుభవార్త కాగా.. స్మిత్‌ ఫామ్‌ ఆసీస్‌ను కలవరపెడుతున్నది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన స్మిత్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. 

రోహిత్‌ శతక్కొడతాడు: లక్ష్మణ్‌ 

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌కు ఆసీస్‌ వికెట్లు బాగా నప్పుతాయని.. కొత్తబంతితో కంగారూ పేసర్లను రోహిత్‌ ఎదుర్కొంటే శతకం బాదడం ఖాయమని దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్‌.. సిడ్నీలో మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో ఓపెనింగ్‌ చేసే చాన్స్‌ ఉందని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ‘కోహ్లీ గైర్హాజరీలో అనుభవజ్ఞుడైన రోహిత్‌ శర్మ జట్టుతో చేరడం టీమ్‌ఇండియాకు లాభదాయకం. 2-1 లేదా 3-1తో ఆసీస్‌ను ఓడించే అవకాశం టీమ్‌ఇండియా ముందుంది. రోహిత్‌ బ్యాటింగ్‌ ైస్టెల్‌ ఆసీస్‌ వికెట్లకు అతికినట్లు సరిపోతుంది. అతడు కొత్త బంతిని ఎదుర్కొంటే భారీ సెంచరీ కొట్టడం ఖాయమే’అని లక్ష్మణ్‌ అన్నాడు.

 వార్నర్‌ ఓ వారియర్‌: లాంగర్‌ 

ఆసీస్‌ విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ వారియర్‌ (యోధుడు) అని ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండేందుకు అతడు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని అన్నాడు. యువ ఓపెనర్‌ విల్‌ పుకోస్కీ సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేయొచ్చని లాంగర్‌ పేర్కొన్నాడు. ‘వార్నర్‌ ఓ యోధుడు. అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆటపట్ల అతడి అంకితభావం వెలకట్టలేనిది. వార్నర్‌ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. మరో ఓపెనర్‌ పుకోస్కీ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. భారత జట్టు క్రమశిక్షణ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా వారి బౌలింగ్‌ విభాగం బాగా రాటుదేలింది. బుమ్రా, అశ్విన్‌ అత్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తున్నారు. వారిని ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా మారింది’ అని లాంగర్‌ చెప్పుకొచ్చాడు.

రాహుల్‌కు గాయం.. 

సిడ్నీ: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌.. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎడమచేతి మణికట్టు బెణకడంతో అతడు మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా.. అతడు గాయపడినట్లు పేర్కొంది. ‘మణికట్టు బెణకడంతో కేఎల్‌ రాహుల్‌ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అతడు తిరిగి కోలుకునేందుకు మూడు వారాల సమయం పట్టొచ్చు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆకట్టుకున్న రాహుల్‌.. తొలి రెండు టెస్టుల్లో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. 


logo