సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 21:18:05

MI vs DC: శిఖర్‌ ధావన్‌ ధనాధన్‌

MI vs DC: శిఖర్‌ ధావన్‌ ధనాధన్‌

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో   మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన  ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో  4 వికెట్లకు  162 పరుగులు చేసింది.   ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్:‌ 52 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ )  అర్ధశతకంతో రాణించగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42: 33 బంతుల్లో 5ఫోర్లు) కెప్టెన్‌  ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.   ఇన్నింగ్స్‌ ఆద్యంతం ధావన్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు.  ముంబై  బౌలర్లు  సత్తా చూపడంతో   ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.   కృనాల్‌ పాండ్య(2/26), ట్రెంట్‌ బౌల్ట్‌(1/36) ఢిల్లీని  దెబ్బ తీశారు.  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది.  24 పరుగులకే రెండు వికెట్లు  కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే పృథ్వీ షా(4) పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య వేసిన ఐదో ఓవర్లో వన్‌డౌన్‌లో వచ్చిన రహానె(15) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు.  సీజన్‌లో రహానె తొలి మ్యాచ్‌ ఆడాడు.  ఆరంభం నుంచి ముంబై బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో  బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడారు.  ఈ దశలో క్రీజులో ఉన్న ధావన్‌, అయ్యర్‌ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించారు.  24/2తో  ఇబ్బందుల్లో పడిన జట్టును ఆదుకున్నారు. 

స్కోరు 100 దాటగానే  క్రీజులో కుదురుకున్న  జోడీ వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే కృనాల్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌  ఇచ్చిన అయ్యర్‌ పెవిలియన్‌ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.  బౌల్ట్‌ వేసిన 16వ ఓవర్లో   ధావన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సీజన్‌లో అతనికిదే తొలి హాఫ్‌సెంచరీ.   ఇదే ఓవర్‌లో  స్టాయినీస్(13)‌ వరుసగా  రెండు ఫోర్లు బాది ప్రమాదకరంగా కనిపించాడు.  రాహుల్‌ చాహర్‌ వేసిన 17వ ఓవర్లో    అనూహ్యంగా స్టాయినీస్‌  రనౌటవడంతో స్కోరు వేగం తగ్గింది.    డెత్‌ ఓవర్లలోనూ ఢిల్లీ భారీగా పరుగులు రాబట్టలేకపోయింది. చివరి బంతి వరకు క్రీజులో ఉన్నా ధావన్‌ స్కోరును 160 దాటించాడు.