శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 09:55:09

ప్రతి జట్టు ఇండియాను ఓడించాలనుకుంటోంది: కోహ్లి

ప్రతి జట్టు ఇండియాను ఓడించాలనుకుంటోంది: కోహ్లి

వెల్లింగ్టన్‌: టీమిండియాను ఓడించాలని అన్ని టెస్టు జట్లు తహతహలాడుతున్నాయని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. బుధవారం జట్టు యాజమాన్యం, కెప్టెన్‌ కోహ్లితో పాటు ఆటగాళ్లు వెల్లింగ్టన్‌లోని భారత హై కమిషన్‌ను వారి కోరిక మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రతి జట్టు ఇండియాను ఓడించడానికి ప్రయత్నిస్తుందని, అందుకు కివీస్‌ మినహాయింపు కాదని కోహ్లి నవ్వుతూ అన్నారు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఇండియా 360 పాయింట్లతో టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. కేవలం 7 మ్యాచ్‌లాడిన ఇండియా అన్నింటా గెలిచి, చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉంది. 296 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆసీస్‌ 10 మ్యాచ్‌లాడి ఏడింట గెలవగా, 2 మ్యాచ్‌ల్లో ఓడి.. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కివీస్‌ కేవలం 60 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది.  

కాగా, హై కమిషనర్‌ తమను ఆహ్వానించడం పట్ల కోహ్లి సంతోషం వ్యక్తం చేశారు. అందుకు వారికి ధన్యవాదాలని కోహ్లి పేర్కొన్నాడు. ప్రతి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఇండియా హైకమిషన్‌ తమను ఆహ్వానించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. 

న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టులో తమ విజయ పరంపరను కొనసాగిస్తామని కోహ్లి తెలిపాడు. తమ జట్టు టెస్టుల్లో అన్ని విభాగాల్లోనూ సమతూకంతో ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. అలాగని కివీస్‌ను తేలికగా తీసుకోమన్న విరాట్‌.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కివీస్‌ టూర్‌లో భారత్‌ ముందుగా 5 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకోగా, వన్డే సిరీస్‌ను కివీస్‌ 3-0తో వైట్‌వాష్‌ చేసింది. ఇక ఆఖరి పోరులో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి. 


logo