బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 01, 2020 , 21:17:28

మోర్గాన్‌ మెరుపులు..రాజస్థాన్‌ లక్ష్యం 192

మోర్గాన్‌ మెరుపులు..రాజస్థాన్‌ లక్ష్యం 192

దుబాయ్‌:  రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(68 నాటౌట్:‌ 35 బంతుల్లో 5ఫోర్లు,  6సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.  తీవ్ర ఒత్తిడిలోనూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో కోల్‌కతా  20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది.   

శుభ్‌మన్‌ గిల్‌(36: 24 బంతుల్లో 6ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి(39: 34 బంతుల్లో  4ఫోర్లు, 2సిక్సర్లు)  చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. రాహుల్‌ తెవాటియా(3/25) సంచలన ప్రదర్శనతో  కోల్‌కతాను భారీ దెబ్బకొట్టాడు. కార్తీక్‌ త్యాగీ  రెండు వికెట్లు తీయగా  జోఫ్రా ఆర్చర్‌,   శ్రేయస్‌ గోపాల్‌  చెరో వికెట్‌ పడగొట్టారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌లో  నితీశ్‌ రాణా(0)    ఔటైనా గిల్‌, త్రిపాఠి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 72 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మధ్య ఓవర్లలో కోల్‌కతా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తెవాటియా, శ్రేయస్‌ దెబ్బకు కోల్‌కతా 99/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మోర్గాన్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టుకు ఊహించని స్కోరు అందించాడు.  ఆండ్రీ రస్సెల్‌(25) ఫర్వాలేదనిపించాడు. 

డెత్‌ ఓవర్లలో మోర్గాన్‌ వీరవిహారం చేశాడు.  బెన్‌స్టోక్స్‌ వేసిన 19వ ఓవర్లో కమిన్స్‌ ఒక సిక్సర్‌ బాదగా మోర్గాన్‌ వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్‌ కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. త్యాగీ వేసిన ఆఖరి బంతికి సిక్సర్‌ బాది స్కోరును 190 దాటించాడు.