బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 08, 2020 , 00:57:24

నేడే ఆరంభం

నేడే ఆరంభం

  • ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌తో క్రికెట్‌ షురూ
  • బయోసెక్యూర్‌ వాతావరణంలో పోరు
  • స్టోక్స్‌ మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్‌లో 

యావత్‌ క్రీడాలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. కరోనా వైరస్‌  మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలుగా స్తంభించిపోయిన క్రికెట్‌.. నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఖాళీ మైదానాలు.. బోసిపోయిన స్టాండ్స్‌.. బయోసెక్యూర్‌ వాతావరణంలో సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు తొలి టెస్టులో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాయి. 

గతంలోలాగా కాకుండా ఇకపై క్రికెట్‌ సరికొత్తగా దర్శనమివ్వనుంది. వికెట్‌ పడితే విభిన్నంగా సంబురాలు.. అసాధారణ క్యాచ్‌ పడితే అభినందనలు ఉండవు. కరోనా వ్యాప్తి చెందకుండా బంతిపై మెరుపు కోసం వాడే ఉమ్మి (సలైవా)పై నిషేధం విధించిన ఐసీసీ.. ఈ సిరీస్‌ను ఓ ప్రయోగంలా పరిగణిస్తున్నది. మరిక ఆలస్యమెందుకు మీరూ సిద్ధమైపోండి మ్యాచ్‌ చూసేందుకు..!  

సౌతాంప్టన్‌: రెండు నెలల క్రితం నుంచి సన్నాహాలు జరుగుతున్న మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ సిరీస్‌ కోసం కరీబియన్‌ దీవుల నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వెస్టిండీస్‌ జట్టు 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకొని మ్యాచ్‌కు రెడీ అయింది. అభిమానులు లేకున్నా ఆటగాళ్లకు ఆ లోటు కనిపించకూడదని.. కేరింతలతో కూడిన శబ్దాలు, మ్యూజిక్‌ను ఏర్పాటు చేసిన ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచానికి ఆటను పరిచయం చేసిన ఇంగ్లండే.. ఇప్పుడు బయో సెక్యూర్‌ వాతావరణంలో క్రికెట్‌ ప్రారంభించనుంది. ఇది సఫలీకృతమైతే.. సిరీస్‌లు నిర్వహించాలని మిగిలిన దేశాల బోర్డులు కూడా తహతహలాడుతున్నాయి. 

స్టోక్స్‌.. స్ట్రోక్‌ ఇస్తాడా..!


ఇంగ్లండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లిష్‌ జట్టుకు తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో వీరోచితంగా పోరాడి జట్టును తొలిసారి విశ్వ విజేతగా నిలిపిన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌కు 81వ సారథి కానున్నాడు. రూట్‌ అందుబాటులో లేకున్నా.. స్టోక్స్‌, బట్లర్‌, బర్న్స్‌, సిబ్లే, డెన్లీ, క్రాలీ, వోక్స్‌తో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. పాతకాపులు అండర్సన్‌, స్టోక్స్‌తో పాటు ఆర్చర్‌ బౌలింగ్‌ భారాన్ని మోయనున్నారు. వెస్టిండీస్‌ పరిస్థితిని చూస్తే.. మూడు దశాబ్దాలుగా కరీబియన్‌ జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ నెగ్గలేదు. హోల్డర్‌ సమర్థవంతమైన నాయకుడే అయినా.. సరిపడా వనరులు లేక ఆ జట్టు వెనుకబడిపోతున్నది. అందులోనూ ఈ సిరీస్‌కు ముందే ఇంగ్లండ్‌ వెళ్లేందుకు కీలక ఆటగాళ్లు నిరాకరించడం కూడా కరీబియన్‌ జట్టును కాస్త దెబ్బతీసింది. బ్యాటింగ్‌లో షాయ్‌ హోప్‌, బ్రాత్‌వైట్‌, బ్రూక్స్‌, క్యాంప్‌బెల్‌, హోల్డర్‌పైనే భారం ఉండనుంది. బౌలింగ్‌ విషయంలో విండీస్‌ కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నది. రోచ్‌, హోల్డర్‌, అల్జారీ జోసెఫ్‌, గాబ్రియల్‌తో ఇంగ్లిష్‌ ప్లేయర్లకు కష్టాలు తప్పకపోవచ్చు.

అందరి దృష్టి అటే.. 

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య సిరీస్‌ జరుగుతున్నదంటే.. దానికి పెద్దగా ప్రేక్షకాదరణ ఉండదనే చెప్పాలి. అందులోనూ టెస్టు సిరీస్‌ అంటే ఇక ఆలోచించాల్సిన పనే లేదు. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లిష్‌ జట్టు బలం, బలగం అందరికీ తెలిసినవే! అయితే కరోనా బ్రేక్‌ తర్వాత తిరిగి జరుగబోతున్న తొలి సిరీస్‌ ఇదే కావడంతో.. అందరి దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది. మూడు నెలలుగా మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులతో పాటు.. క్రికెట్‌ బోర్డులు కూడా ఓ కన్నేశాయి. 

ఐపీఎల్‌కు బాటలు పడేనా..!

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న పొట్టి ప్రపంచకప్‌పై మల్లగుల్లాలు పడుతున్న ఐసీసీ కూడా ఈ సిరీస్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. బయోసెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌ల నిర్వహణ ఎలా ఉండబోతుందనే అంశంపై కన్నేసింది. మరోవైపు పైకి చెప్పకపోయినా  బీసీసీఐ కూడా ఈ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. 

కొత్తకొత్తగా.. 


ఒక సిరీస్‌ ప్రారంభమవుతున్నదంటే.. ఇరు జట్ల బలాబలాలు.. కెప్టెన్‌ల తీరు తెన్నులు.. బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌.. బౌలర్ల స్వింగ్‌..పిచ్‌ స్వభావం.. వాతావరణ పరిస్థితులు..ఇలా సవాలక్ష విషయాలు చర్చకు వచ్చేవి. కానీ కొవిడ్‌-19  పరిస్థితి వల్ల మొత్తం మారిపోయింది. ఇప్పుడు చర్చంతా.. బయో సెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌ ఎలా సాగుతుంది? ఆటగాళ్ల మధ్య భౌతిక దూరం సాధ్యమేనా? ఉమ్మి రాయకుండా బంతి స్వింగ్‌ అవుతుందా? విజయం సాధిస్తే సంబురాలు ఎలా జరుపుకుంటారు? మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించాలంటే మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిందే. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ‘బ్లాక్‌ లివ్స్‌ మ్యాటర్‌' లోగోతో బరిలో దిగనున్నారు. అమెరికా పోలీసు దౌర్జన్యం కారణంగా ప్రాణాలొదిలిన అమెరికన్‌-ఆఫ్రికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి సంతాపంగా ప్లేయర్ల జెర్సీ కాలర్లపై ఈ లోగో కనిపించనుంది.


Previous Article దళారీ వల
Next Article దళారీ వల

తాజావార్తలు


logo