ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 00:20:32

పాకిస్థాన్‌ 139/2

పాకిస్థాన్‌ 139/2

  • ఇంగ్లండ్‌తో తొలి టెస్టు

మాంచెస్టర్‌: స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ (69 బ్యాటింగ్‌; 11 ఫోర్లు), ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (46 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ ఫర్వాలేదనిపించింది. వర్షం కారణంగా 49 ఓవర్లు మాత్రమే సాధ్యమైన తొలిరోజు ఆటలో పాకిస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌కు శుభారంభం లభించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్ల కవ్వింపులకు ఏకాగ్రత కోల్పోయిన ఓపెనర్‌ ఆబిద్‌ అలీ (16) ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. మరో మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్‌కు అతిపెద్ద షాక్‌ తగిలింది. క్రీజులో పట్టుమని పది నిమిషాలు నిలువకముందే కెప్టెన్‌ అజహర్‌ అలీ (0)ని వోక్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆ జట్టు 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షాన్‌ మసూద్‌తో కలిసి బాబర్‌ ఆజమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

బాబర్‌ బౌండ్రీల మోత

ఆరంభంలో కాస్త తడబడిన బాబర్‌ ఆజమ్‌ క్రీజులో నిలదొక్కుకున్నాక బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో ఎదుర్కొన్న 22 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసిన బాబర్‌ 70 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోవడం విశేషం. బాబర్‌ అండతో షాన్‌ మసూద్‌ కూడా చెలరేగాడు. ఈ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ రెండు గంటలపాటు నిలిచిపోయింది. అనంతరం ఆట తిరిగి ప్రారంభమైనా వెలుతురు లేమి కారణంగా కేవలం మరోసారి ఆగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, ఆర్చర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 139/2 (బాబర్‌ ఆజమ్‌ 69 బ్యాటింగ్‌; షాన్‌ మసూద్‌ 46 బ్యాటింగ్‌; వోక్స్‌ 1/14, ఆర్చర్‌ 1/23). 

నోబాల్‌ టీవీ అంపైర్‌కే.. 

ఈ మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లోనూ ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ బాధ్యత టీవీ అంపైర్‌ వద్దకు చేరింది. వన్డే ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ సిరీస్‌లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనను టెస్టుల్లోనూ కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. పనితీరు పరిశీలించాక భవిష్యత్తులో సుదీర్ఘ ఫార్మాట్‌లో దీన్ని వినియోగించాలా వద్దా అని నిర్ణయిస్తాం’అని ఐసీసీ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొంది.


logo