శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 22:12:33

ఐర్లాండ్​.. పడినా పర్వాలేదనిపించింది

ఐర్లాండ్​.. పడినా పర్వాలేదనిపించింది

సౌతాంప్టన్:  ఇంగ్లండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ జట్టు ప్రారంభంలో తీవ్రంగా తడబడినా.. ఆ తర్వాత కాస్త కోలుకుంది. గురువారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఐర్లాండ్​ ఓ దశలో 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా.. అరంగేట్ర బ్యాట్స్​మన్​ కర్టిస్ కాంఫెర్​(118 బంతుల్లో 59 నాటౌ​ట్​) అజేయ అర్ధశతకం సహా ఆండీ మెక్​ బ్రైన్​(48 బంతుల్లో 40) రాణించడంతో 44.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్​ డేవిడ్ విల్లీ(5/30) ధాటికి ఐర్లాండ్  స్వల్ప స్కోరుకే కుప్పకూలుతుందనుకున్నా…కాస్త గౌరవప్రదమైన స్కోరును సాధించి ఆతిథ్య జట్టుకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐర్లాండ్ ఓపెనర్ పౌల్ స్టిర్లింగ్​(2)ను విల్లే త్వరగా పెవియన్​కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఐర్లాండ్​ కెప్టెన్ బాల్​బిర్ని(3), హ్యారీ టెక్టర్​(0) వెనువెంటనే ఔట్ కాగా కాసేపటికే డెలానీ(22) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెవిన్ ఓబ్రెయిన్​(22) కాసేపు మెరిసినా రాణించలేకపోగా, టకర్(0) డకౌటయ్యాడు. ఆ తర్వాత కాంఫెర్​, మెక్​ బ్రైన్ నిలకడగా ఐర్లాండ్ ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. కాగా ఇంగ్లిష్ బౌలర్లలో షకీబ్ మహమూద్​ రెండు, ఆదిల్ రషీద్​, కరన్ చెరో వికెట్ పడగొట్టారు. 173 పరుగుల లక్ష్యఛేదనకు ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.

సుదీర్ఘ కాలం తర్వాత..

కరోనా వైరస్​ ప్రవేశించిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ వన్డే ఇదే. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత 50ఓవర్ల ఆట మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బయో సెక్యూర్ వాతావరణంలో.. ప్రేక్షకులు లేకుండా ఈ మూడు వన్డేల సిరీస్ ఇంగ్లిష్ గడ్డపై జరుగుతున్నది. కాగా 2023 ప్రపంచకప్ అర్హత కోసం ఐసీసీ ప్రవేశపెట్టిన సూపర్​ లీగ్​ కూడా ఈ మ్యాచ్​తోనే షురూ అయింది.


logo