బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 00:10:03

ఒక్క బంతీ పడకుండానే

ఒక్క బంతీ పడకుండానే

  • నాలుగో రోజు ఆట వర్షార్పణం.. నేడు   కూడా వర్షం పడే అవకాశం

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్‌కు వరుణుడు అండగా నిలిచాడు. కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో కరీబియన్లకు వర్షం కల్పతరువుగా మారి సోమవారం నాలుగో రోజు ఆటను పూర్తిగా తుడిచిపెట్టింది. 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి  2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో అంపైర్లు పలు మార్లు పిచ్‌ను పరిశీలించినా ఆటకు అనుకూల వాతావరణం లేకపోవడంతో.. చివరకు రద్దు చేశారు. ప్రస్తుతం చేతిలో 8 వికెట్లు ఉన్న హోల్డర్‌ సేన విజయానికి ఇంకా 389 పరుగులు చేయాల్సి ఉంది. బ్రాత్‌వైట్‌ (2), హోప్‌ (4) క్రీజులో ఉన్నారు. బ్రాడ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 

బ్రాడ్‌ మరొక్క వికెట్‌ తీస్తే..

టెస్టు క్రికెట్‌లో ఇప్పటికే 499 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మరో వికెట్‌ తీసి 500 క్లబ్‌లో చేరాలని ఆశపడుతున్న సమయంలో వర్షం అడ్డుగా నిలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో వెస్టిండీస్‌ విజయం సాధించగా.. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ లెక్క సరిచేసింది. ఇక నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో గెలిచి విజ్డన్‌ ట్రోఫీని చేజిక్కించుకోవాలని భావించిన ఇంగ్లిష్‌ జట్టుకు వర్షం అడ్డంకిగా నిలిచింది. ఆటకు చివరి రోజైన మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నా.. ఏ మాత్రం వీలు చిక్కినా.. కరీబియన్లను ఆలౌట్‌ చేసి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నది.


logo