శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 00:35:30

విజయం వాకిట ఇంగ్లండ్‌

విజయం వాకిట ఇంగ్లండ్‌

  • విండీస్‌ లక్ష్యం 399 
  • ప్రస్తుతం 10/2 

మాంచెస్టర్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు.. సిరీస్‌ విజయంపై కన్నేసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు.. రెండో మ్యాచ్‌ నెగ్గి సిరీస్‌ సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టులోనూ విజయం వాకిట నిలిచింది. 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌.. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (2), షై హోప్‌ (4) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (6/31, 2/8) రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించాడు. ప్రస్తుతం చేతిలో 8 వికెట్లు ఉన్న హోల్డర్‌ సేన విజయానికి ఇంకా 389 పరుగులు చేయాల్సి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేయడం కూడా విండీస్‌కు శక్తికి మించిన  పనే. సోమవారం అంతా పోరాడి ఆటను ఆఖరి రోజుకు తీసుకెళ్తుందా.. లేక తొలి సెషన్‌లోనే కుప్పకూలి ఇంగ్లండ్‌కు సిరీస్‌ సమర్పించుకుంటుందా చూడాలి. 

స్టువర్ట్‌ సిక్సర్‌

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 137/6తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్టిండీస్‌ 197 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జాసెన్‌ హోల్డర్‌ (46), డౌరిచ్‌ (37) ఫర్వాలేదనిపించగా.. బ్రాడ్‌ (6/31) ధాటికి మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. మూడో రోజు విండీస్‌ కోల్పోయిన నాలుగు వికెట్లు బ్రాడ్‌ ఖాతాలోకే వెళ్లడం విశేషం.

బర్న్స్‌, రూట్‌ జోరు..

తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయి ఆడిన రూట్‌ సేన చివరకు 226/2 వద్ద డిక్లేర్‌ చేసింది. ఓపెనర్లు బర్న్స్‌ (90; 10 ఫోర్లు), సిబ్లే (56; 7 ఫోర్లు) గట్టి పునాది వేస్తే.. కెప్టెన్‌ జో రూట్‌ (58 బంతుల్లో 68 నాటౌట్‌; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) వన్డే తరహా ఇన్నింగ్స్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌, చేజ్‌కు చెరో వికెట్‌ దక్కింది. సెంచరీకి చేరువైన బర్న్స్‌ ఔట్‌ కాగానే రూట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 369 ఆలౌట్‌, వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్‌, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 226/2: డిక్లేర్డ్‌  వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 10/2 (బ్రాత్‌వైట్‌ 2 బ్యాటింగ్‌, హోప్‌ 4 బ్యాటింగ్‌; బ్రాడ్‌ 2/8). 

మరక మంచిదేగా!  


ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చేష్టలు అందరికీ నవ్వులు తెప్పించాయి. విండీస్‌తో మూడో టెస్టు రెండో రోజు ఆటలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టోక్స్‌ను చూసి కెప్టెన్‌ జో రూట్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. స్టోక్స్‌ ప్యాంట్‌ వెనుక మరకను చూసిన రూట్‌ పడిపడి నవ్వాడు. మరక కనిపించకుండా ఉండేందుకు స్టోక్స్‌ పడరాని పాట్లు పడ్డాడు. ఓసారి జంపర్‌తో కవర్‌ చేద్దామనుకున్న ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌.. మరోమారు ప్యాం ట్‌ కిందికి అనుకున్నాడు. ఇదంతా లైవ్‌లో రికార్డు అయ్యింది. ఈ విషయాన్ని  వ్యాఖ్యాత డేవిడ్‌ లాయిడ్‌ కూడా గుర్తించి కామెంటరీ చేశాడు. 1990 ఫిఫా ప్రపంచకప్‌లో అప్పటి ఇంగ్లండ్‌ స్ట్రైకర్‌ గ్యారీ లింకర్‌ ఉదంతాన్ని గుర్తుకుతెస్తూ హాస్యాన్ని జోడించాడు. బీబీసీ చేసిన ట్వీట్‌కు స్టోక్స్‌ స్పందిస్తూ ‘ఒలికిన కాఫీపై కూర్చోవడం వల్ల మరక అంటింది’ అంటూ రాసుకొచ్చాడు.  


logo