మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 10, 2020 , 00:44:32

హోల్డర్‌ సిక్సర్‌

హోల్డర్‌ సిక్సర్‌

  • 6వికెట్లతో విజృంభణ.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 204 ఆలౌట్‌

లైవ్‌ మ్యాచ్‌ చూడాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులను తొలిరోజు ఉసూరు మనిపించిన వరుణుడు.. రెండోరోజు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెలరేగిన విండీస్‌ పేసర్లు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఓ పట్టుపట్టారు. ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒక్క అర్ధసెంచరీ కూడా చేయనివ్వకుండా కట్టిపడేశారు. తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన స్టోక్స్‌ కాస్త పోరాడటంతో.. ఓ మాదిరి స్కోరు చేసిన ఆతిథ్య జట్టు.. ఆ తర్వాత కరీబియన్లను కట్టడి చేయడంలో పెద్దగా సఫలీకృతం కాలేదనే చెప్పాలి. 

సౌతాంప్టన్‌: యావత్‌ ప్రపంచం దృష్టిసారించిన ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ తొలి టెస్టు అంచనాలకు అందకుండా సాగుతున్నది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చెలరేగుతుందనుకుంటే.. కరీబియన్‌ పేస్‌ ధాటికి స్టోక్స్‌ సేన విలవిల్లాడింది. హోల్డర్‌ (6/42), గాబ్రియల్‌ (4/62) విజృంభణతో ఇంగ్లిష్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్‌ (43; 7 ఫోర్లు), బట్లర్‌ (35; 6 ఫోర్లు), బెస్‌ (31 నాటౌట్‌), బర్న్స్‌ (30) ఫర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ జట్టు వెలుతురులేమి కారణంగా గురువారం ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (20), హోప్‌ (3) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ స్కోరుకు ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. 

స్టోక్స్‌ ఒక్కడే..

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను విండీస్‌ బౌలర్లు ఆటాడుకున్నారు. డెన్లీ (18)తో ప్రారంభమైన వికెట్ల వేట ఏ దశలోనూ ఆగలేదు. కాసేపటికే బర్న్స్‌ ఔట్‌ కాగా.. క్రాలీ (10), పోప్‌ (12) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయారు. దీంతో 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జట్టును స్టోక్స్‌ ఆదుకున్నాడు. బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ కాస్త కోలుకుంది. కానీ, స్టోక్స్‌ ఔటయ్యాక ఇంగ్లిష్‌ జట్టు ఆట ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చివర్లో బెస్‌ కొన్ని విలువైన పరుగులు జోడించి జట్టు స్కోరును 200 దాటించాడు. 

క్యాంప్‌బెల్‌ మూడుసార్లు 

విండీస్‌ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై ఇంగ్లండ్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లంచ్‌ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ సాధికారికంగా ముందుకు సాగింది. సీనియర్‌ పేసర్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో రెండుసార్లు  వికెట్ల ముందు దొరికిపోయినా.. డీఆర్‌ఎస్‌తో బయటపడ్డ విండీస్‌ ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ (28) ఎట్టకేలకు మూడోసారి ఎల్బీగా పెవిలియన్‌ బాటపట్టాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ జట్టుకు కాస్త సానుకూల అంశం ఇదే. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 204 ఆలౌట్‌ ( స్టోక్స్‌ 43, బట్లర్‌ 35, బెస్‌ 31 నాటౌ ట్‌; హోల్డర్‌ 6/42, గాబ్రియల్‌ 4/62), వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 57/1 (బ్రాత్‌వైట్‌ 20 నాటౌట్‌, హోప్‌ 3 నాటౌట్‌; అండర్సన్‌ 1/17).


logo