e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home స్పోర్ట్స్ ఇంగ్లండ్‌ ఇంటికి

ఇంగ్లండ్‌ ఇంటికి

ఇంగ్లండ్‌ ఇంటికి

స్వదేశానికి చేరిన ఇంగ్లిష్‌ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం

కరోనా విజృంభణతో ఐపీఎల్‌ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తొలుత భారత్‌ గడప దాటగా.. మిగిలిన దేశాల ప్లేయర్లు బయలుదేరేందుకు వేచిచూస్తున్నారు. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఆటగాళ్లను వారి దేశాలకు పంపడం బీసీసీఐకి సవాలుగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లను మాల్దీవులకు పంపాలని భారత బోర్డు నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలు మొదలయ్యాయి. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తొలుత స్వదేశంలో అడుగుపెట్టగా మిగిలిన వారు బయలుదేరేందుకు వేచిచూస్తున్నారు. ఐపీఎల్‌లో పాల్గొన్న 11 మంది ఇంగ్లిష్‌ ఆటగాళ్లలో 8 మంది బుధవారం లండన్‌కు చేరారు. జానీ బెయిర్‌స్టో, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, క్రిస్‌ మోరిస్‌, మొయిన్‌ అలీ, జేసన్‌ రాయ్‌ స్వదేశానికి వచ్చారని, లండన్‌లో ప్రభుత్వం ఆమోదించిన హోటల్‌లో వారు క్వారంటైన్‌లో ఉంటారని ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే క్రిస్‌ జోర్డాన్‌, డేవిడ్‌ మలన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ మరో 48 గంటల్లో భారత్‌ నుంచి బయలుదేరుతారని చెప్పారు. కాగా బయోబబుల్‌లో వరుసగా కరోనా కేసులు బయటపడడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అలాగే విదేశీ ఆటగాళ్లను క్షేమంగా పంపుతామని భారత బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు భారత ఆటగాళ్లు సైతం ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

షెడ్యూల్‌ కంటే ముందుగానే!

ఇంగ్లండ్‌ వెళ్లనున్న టీమ్‌ఇండియా

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు వచ్చే నెలలో ఇంగ్లండ్‌ బయలు దేరాల్సిన భారత జట్టు షెడ్యూల్‌ కంటే ముందుగానే అక్కడికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా పలు దేశాలు అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం విధించగా.. ఈ నెల చివరి వరకే టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 14వ సీజన్‌ ముగిసిన అనంతరం కోహ్లీసేనతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో (జూన్‌ 18-22) పాల్గొంటున్న న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఇక్కడి నుంచే ఇంగ్లండ్‌ వెళ్లాలని భావించినా.. లీగ్‌ అర్ధాంతరంగా ముగియడంతో మనవాళ్లు ముందుగానే ఇంగ్లండ్‌ బయలుదేరనున్నారు.

ఆసీస్‌ ఆటగాళ్లు.. వయా మాల్దీవులు

ఆస్ట్రేలియా ఆటగాళ్లను వారి దేశానికి పంపడం బీసీసీఐకి సవాలుగా మారింది. భారత్‌ నుంచి విమాన రాకపోకలపై అక్కడి ప్రభుత్వం మే 15 వరకు నిషేధం విధించింది. ఆటగాళ్ల కోసం కూడా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయబోమని, వారికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆంక్షలు ముగిసే వరకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను మాల్దీవుల్లో ఉంచాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇందుకోసం శ్రీలంకను కూడా పరిగణనలోకి తీసుకోగా.. చివరికి మాల్దీవులకే ఓటేసింది. ప్రత్యేక విమానంలో ఆసీస్‌ ఆటగాళ్లు మాల్దీవులకు చేరుకుంటారని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి వెల్లడించారు. ఇక తమ ఆటగాళ్లను క్షేమంగా ఇండ్లకు పంపేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంటున్నదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక చీఫ్‌ నిక్‌ హ్యాక్లీ చెప్పారు. కాగా వైరస్‌ బారిన పడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ భారత్‌లోనే క్వారంటైన్‌లో ఉండనున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో ఆడిన దక్షిణాఫ్రికా (11), న్యూజిలాండ్‌ (10), వెస్టిండీస్‌ (9), ఆఫ్ఘనిస్థాన్‌ (3), బంగ్లాదేశ్‌ (2) ఆటగాళ్లు కూడా స్వదేశాలకు వెళ్లేందుకు వేచిచూస్తున్నారు.

ఆ మార్పులు చేసి ఉంటే: కమిన్స్‌

ఐపీఎల్‌ నిర్వహణ ప్రణాళికలో కొన్ని మార్పులు జరిగి ఉంటే టోర్నీ విజయవంతంగా సాగేదనేలా ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడాడు. ఆరు వేదికలు కాకుండా టోర్నీని తక్కువ నగరాలకు పరిమితం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.‘గతేడాది యూఏఈలో ఐపీఎల్‌ ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగింది. అయితే ఈ ఏడాది ముందడుగు వేసి ఎక్కువ నగరాల్లో టోర్నీని నిర్వహించాలని నిర్ణయించారు. వెనక్కి తిరిగి చూస్తే.. కొన్ని మార్పులు జరిగి ఉండాల్సింది అని అనిపిస్తున్నది’ అని ఓ ఇంటర్వ్యూలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేయర్‌ కమిన్స్‌ అన్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంగ్లండ్‌ ఇంటికి

ట్రెండింగ్‌

Advertisement