సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 17:28:18

ఇంగ్లాండ్‌ పేసర్ల జోరు.. వెస్టిండీస్‌ టాప్ ఆర్డర్ విఫలం

ఇంగ్లాండ్‌ పేసర్ల జోరు.. వెస్టిండీస్‌ టాప్ ఆర్డర్ విఫలం

మాంచెస్టర్‌: ఇంగ్లాండ్‌తో  నిర్ణయాత్మక మూడో టెస్టులో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ విజయానికి చేరువలో ఉంది.  వర్షం అంతరాయం కలిగించకపోతే సిరీస్‌ను  ఇంగ్లాండ్‌ కైవసం చేసుకోవడం దాదాపు ఖరారైనట్లే.  ఆటకు వరుణుడు అడ్డంకిగా మారితే మ్యాచ్‌ డ్రాగా ముగియనుంది.  ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 5 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.   

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కరీబియన్లు..రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.  సంచలన ప్రదర్శనతో సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ విండీస్‌ను దారుణంగా దెబ్బతీశాడు.  ఇంగ్లీష్‌ పేసర్ల ధాటికి కరీబియన్‌ బ్యాట్స్‌మన్‌ ఎక్కువసేపు  క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 

399 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ 23.3 ఓవర్లలో  5 వికెట్లకు 84 పరుగులే చేసింది. ఇంకా 80 ఓవర్ల ఆట మిగిలి ఉన్నప్పటికీ మధ్యమధ్యలో చిరుజల్లుల కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఇప్పటికే టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌ చేరడంతో ఐదోరోజు ఆట కొంతసేపు జరిగినా ఇంగ్లాండ్‌ విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి  సందేహం లేదు.


logo