శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 08, 2020 , 12:21:16

స్టోక్స్‌ విజృంభణ

స్టోక్స్‌ విజృంభణ

కేప్‌టౌన్‌ : బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన బెన్‌ స్టోక్స్‌ (3/35) బౌలింగ్‌లోనూ సత్తాచాటడంతో దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఓ దశలో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో స్టోక్స్‌ చివర్లో మూడు వికెట్లను వెంటవెంటనే తీసి జట్టును గెలిపించాడు. రెండో టెస్టు చివరి రోజైన మంగళవారం 438పరుగుల భారీ లక్ష్యఛేదనలో మలన్‌ (84), డికాక్‌ (50) మినహా మరెవరూ రాణించలేకపోవడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌ 189 పరుగుల తేడాతో గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇంగ్లిష్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' స్టోక్స్‌ సహా అండర్సన్‌ (2/23), డెనీ ్ల(2/42) అదరగొట్టారు. రెండు వికెట్ల నష్టానికి 126 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆటకు దిగిన సఫారీలకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (17) కొన్ని బంతులాడినా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆది నుంచి ఒంటరి పోరాటం చేసిన మలన్‌ కూడా ఔటవడంతో దాదాపు సఫారీల ఓటమి ఖరారైంది. అయితే డికాక్‌ అర్ధశతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. డసెన్‌ (140 బంతుల్లో 17) అతడికి తోడుగా నిలిచాడు. జట్టు స్కోరు 237 పరుగుల వద్దే వీరిరువురూ ఔట్‌కాగా, చివరి మూడు వికెట్లను స్టోక్స్‌ పడగొట్టాడు.


logo