ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 10:33:29

ఇంగ్లాండ్‌కు ఎదురే లేదు..తొలి ఇన్నింగ్స్‌ 583/8 డిక్లేర్డ్‌

ఇంగ్లాండ్‌కు ఎదురే లేదు..తొలి ఇన్నింగ్స్‌ 583/8 డిక్లేర్డ్‌

సౌతాంప్టన్‌:  పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు భారీ స్కోరు సాధించింది. రెండో రోజే  నిర్ణయాత్మక మూడో  టెస్టును గుప్పిట్లోకి తెచ్చుకుంది.   జాక్‌ క్రాలీ (267), జోస్‌ బట్లర్‌ (152) అద్వితీయ  ఆటతీరుతో అదరగొట్టారు.  బ్యాట్స్‌మెన్‌ పోటీ పడి మరీ పరుగులు బాదారు.  ఈ జోడీ ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 171తో రెండోరోజు ఆట కొనసాగించిన క్రాలీ కళ్లుచెదిరే బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒక దశలో 127/4తో నిలిచిన ఇంగ్లాండ్‌ను క్రాలీ, బట్లర్‌ జోడీ పట్టుదలతో పోరాడి జట్టును పటిష్ఠస్థితిలో నిలిపారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు   359 పరుగులు జోడించారు. 

క్రీజులో కుదురుకున్న జోడీ  ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి.  క్రాలీ ఎనిమిదో టెస్టు ఆడుతూ కెరీర్లో తొలి డబుల్‌ సెంచరీ సాధించి అరుదైన రికార్డు  నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు డబుల్‌ సెంచరీ సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా క్రాలీ నిలిచాడు. అతి చిన్న వయసులోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన క్రాలీని ప్రత్యర్థి పాక్‌ ఆటగాళ్లతో పాటు సహచర ఆటగాళ్లు అభినందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 154.4 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్‌ 583/8  పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నిం గ్స్‌ను డిక్లేర్‌ చేసింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అప్రిదీ, యాసిర్‌ షా, ఆలం తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


logo