టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ ఒంటరి పోరాటంతో ఓ మాదిరి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. హిట్‌మ్యాన్ తిరిగి వచ్చినా.. రాహుల్ పేలవ ఫామ్ కొనసాగించడంతో పవర్ ప్లే ముగిసేసరికి కోహ్లీసేన 24/3తో నిలిస్తే.. ఆరంభం నుంచే బట్లర్ బాదుడు మీద దృష్టిపెట్టడంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లిష్ జట్టు 57/1తో విజయం ఖరారు చేసుకుంది. మార్క్ వుడ్ పేస్‌కు దాసోహమన్న భారత ఆటగాళ్లు.. ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకోలేక మూల్యం చెల్లించుకున్నారు.
అహ్మదాబాద్: బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యానికి.. బౌలర్ల బాధ్యతారాహిత్యం తోడవడంతో ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత్ ఓటమి పాలైంది. మొదట మార్క్ వుడ్ (3/31) పేస్‌తో బెంబేలెత్తిస్తే.. ఆనక ఛేజింగ్‌లో బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. దీంతో మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన వందో అంతర్జాతీయ టీ20లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. ఇషాన్ కిషన్‌కు తన స్థానాన్ని అప్పగించి సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో (40 నాటౌట్) దంచికొట్టారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 15, రాహుల్ (బి) వుడ్ 0, ఇషాన్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 4, కోహ్లీ (నాటౌట్) 77, పంత్ (రనౌట్) 25, శ్రేయస్ (సి) మలన్ (బి) వుడ్ 9, పాండ్యా (సి) ఆర్చర్ (బి) జోర్డాన్ 17, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 156/6. వికెట్ల పతనం: 1-7, 2-20, 3-24, 4-64, 5-86, 6-156, బౌలింగ్: రషీద్ 4-0-26-0, ఆర్చర్ 4-0-32-0, వుడ్ 4-0-31-3, జోర్డాన్ 4-1-35-2, స్టోక్స్ 2-0-12-0, సామ్ కరన్ 2-0-14-0.
ఇంగ్లండ్: రాయ్ (సి) రోహిత్ (బి) చాహల్ 9, బట్లర్ (నాటౌట్) 83, మలన్ (స్టంప్డ్) పంత్ (బి) సుందర్ 18, బెయిర్‌స్టో (నాటౌట్) 40, ఎక్స్‌ట్రాలు: 8 మొత్తం: 18.2 ఓవర్లలో 158/2. వికెట్ల పతనం: 1-23, 2-81, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-0, శార్దూల్ 3.2-36-0, చాహల్ 4-0-41-1, పాండ్యా 3-0-22-0, సుందర్ 4-0-26-1.