మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 14, 2021 , 08:50:17

ఇంగ్లండ్ క్రికెట‌ర్‌కు కొత్త ర‌కం క‌రోనా

ఇంగ్లండ్ క్రికెట‌ర్‌కు కొత్త ర‌కం క‌రోనా

కొలంబో: శ‌్రీలంక‌లో ఉన్న‌ ఇంగ్లండ్ క్రికెట‌ర్ మొయిన్ అలీ క‌రోనా వైర‌స్ కొత్త యూకే వేరియంట్ బారిన ప‌డ్డాడు. ప‌ది రోజుల కింద‌ట శ్రీలంక టూర్‌కు వ‌చ్చిన మొయిన్ అలీ.. అప్పుడే కొవిడ్ పాజిటివ్‌గా తేలాడు. తాజాగా అది యూకే వేరియంట్ అని తేల్చారు. ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కేసు శ్రీలంక‌లో మొద‌టిది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ యూకే వేరియంట్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడు శ్రీలంక అధికారుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ కొత్త ర‌కం క‌రోనా అత‌ని నుంచి వేరే వాళ్ల‌కు వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

నిజానికి బ్రిట‌న్ నుంచి వ‌చ్చే విమానాల‌పై శ్రీలంక నిషేధం విధించినా.. క్రికెట్ టీమ్‌కు మాత్రం ఇందులో నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ఈ టూర్‌లో భాగంగా రెండు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. గురువార‌మే తొలి టెస్ట్ ప్రారంభ‌మైంది. మొయిన్ అలీకి మొద‌ట ప‌ది రోజుల క్వారంటైన్ విధించగా.. ఇప్పుడు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో దానిని పొడిగించారు. అటు ఇత‌నితో స‌న్నిహితంగా ఉన్న మ‌రో ఇంగ్లండ్ క్రికెట‌ర్ క్రిస్ వోక్స్ కూడా తొలి టెస్ట్‌కు దూరం కానున్నాడు.