బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 10, 2020 , 17:15:56

ఇంగ్లాండ్‌ క్రికెటర్ల జెర్సీపై భారత సంతతి వైద్యుల పేర్లు

ఇంగ్లాండ్‌ క్రికెటర్ల జెర్సీపై భారత సంతతి వైద్యుల పేర్లు

లండన్‌:  కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని గౌరవించాలని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది.  117 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ పునఃప్రారంభమైన  నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌  హెల్త్‌కేర్‌ వర్కర్ల సేవలకు సంఘీభావంగా వైద్యుల పేర్లతో ఉన్న జెర్సీలను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌ ధరించింది. నలుగురు భారత సంతతి డాక్టర్ల పేర్లతో ఉన్న  జెర్సీలను కూడా ఇంగ్లీష్‌ క్రికెటర్లు ధరించడం విశేషం. 

'రైజ్‌ ది బ్యాట్'‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ టీమ్‌ తాత్కాలిక కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌  భారత్‌కు చెందిన డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ పేరుతో ఉన్న జెర్సీని వేసుకున్నాడు.  డార్లింగ్టన్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)  ట్రస్టు‌ హాస్పిటల్‌లోని ఐసీయూలో వికాస్‌ కుమార్‌ వైద్యసేవలందిస్తున్నారు.  వికాస్‌ పేరుతో ఉన్న జెర్సీని వేసుకొని స్టోక్స్‌ వెస్టిండీస్‌తో తొలి టెస్టులో బరిలోదిగాడు. తనపేరుతో ఉన్న టీషర్ట్‌ను స్టోక్స్‌ ధరించడంపై వికాస్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

'స్టోక్స్‌తో పాటు మిగతా క్రికెటర్లు  మంచి సందేశం ఇవ్వాలనుకోవడం గొప్ప పరిణామం. కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స చేయడం చాలా  కష్టమైనది. ఎన్‌హెచ్‌ఎసీ వైద్య సిబ్బంది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులందరితో పాటు భారత్‌లో ఉన్న  వైద్యమిత్రులకు  ఈ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని' వికాస్‌ పేర్కొన్నారు.  తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని, ఐతే తన సోదరుల మాదిరిగానే నేను కూడా డాక్టర్‌ అయినట్లు వికాస్‌ చెప్పారు. 

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కుమార్‌ మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో అనస్థీషియాలో పీజీ డిప్లోమా పూర్తి చేశారు. 2019లో తన భార్య, రెండేండ్ల కుమారుడితో కలిసి ఆయన  ఇంగ్లాండ్‌కు వెళ్లారు.  మరో ముగ్గురు భారత సంతతి వైద్యులు  డాక్టర్‌  జమాస్ప్‌ కైఖుస్రూ దస్తూర్‌(నార్విచ్‌), ఫిజియో థెరపిస్ట్‌  క్రిషాన్‌  అగాధ(లీసెస్టర్‌), హరికృష్ణ షా  పేర్లతో ఉన్న జెర్సీలను ఇంగ్లాండ్‌ ప్లేయర్లు ధరించారు. 

తాజావార్తలు


logo