మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Feb 17, 2020 , 00:30:45

ఊదేశారు

ఊదేశారు
  • మూడో టీ20లోసఫారీలపై జయభేరి
  • 2-1తో సిరీస్‌ కైవసం

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా గడ్డపై సిక్సర్ల వర్షం, పరుగుల వరద పారిన టీ20 సిరీస్‌ను చివరికి ఇంగ్లండ్‌ చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆతిథ్య సఫారీ జట్టు చేసిన 222 పరుగుల భారీ స్కోరు చిన్నబోయింది. దీంతో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచి 2-1తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. క్లాసెన్‌ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది.


ఇంగ్లండ్‌ బౌలర్లలో టామ్‌ కరన్‌, స్టోక్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనలో బట్లర్‌ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (34 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలుత దూకుడుగా ఆడగా.. ఆ తర్వాత కెప్టెన్‌ మోర్గాన్‌ (22 బంతుల్లో 57; 7 సిక్సర్లు) సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ ఐదు వికెట్లకు 226 పరుగులు చేసి గెలిచింది. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ రెండు వికెట్లు తీసినా 55 పరుగులు సమర్పించుకున్నాడు. మిగిలిన బౌలర్లందరూ 10కి పైగా ఎకానమీ నమోదు చేసి ధారాళంగా పరుగులిచ్చారు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన ఇంగ్లిష్‌ సారథి మోర్గాన్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలిస్తే.. తర్వాతి మ్యాచ్‌లో టామ్‌ కరన్‌ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ రెండు పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. 


బెయిర్‌స్టో, బట్లర్‌ దూకుడు 

భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ ఏ దశలోనూ దూకుడు తగ్గించలేదు. చేయాల్సిన రన్‌రేట్‌ పెరగకుండా, ఎలాంటి ఉత్కంఠకు తావివ్వకుండా పనిని ముగించింది. తొలుత ఓపెనర్‌ రాయ్‌ (7) విఫలమైనా జోస్‌ బట్లర్‌ బౌండరీల మోత మోగించాడు. సఫారీ స్టార్‌ పేసర్‌ స్టెయిన్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో బాదుడు ప్రారంభించిన జోస్‌.. మూడో ఓవర్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. అతడికి బెయిర్‌స్టో జతకలువడంతో విధ్వంసం తారస్థాయికి చేరింది. ఇద్దరూ పోటీపడి వీరబాదుడు బాదడంతో 9 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లిష్‌ జట్టు 104/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అర్ధశతకం తర్వాత బట్లర్‌ వెనుదిరగడంతో 49 బంతుల్లో 91 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపు దూకుడుగా ఆడిన బెయిర్‌స్టో సైతం హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక పెవిలియన్‌ బాట పట్టాడు. 


మోర్గాన్‌ వీరబాదుడు 


అనంతరం స్వల్ప స్కోరుకే మలన్‌ (11) ఔట్‌ కాగా, ఆ తర్వాత వచ్చిన ఇంగ్లిష్‌ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోయాడు. ప్రిటోరియస్‌ వేసిన 15వ ఓవర్లో రెండు సిక్సర్లతో బాదుడు ప్రారంభించిన మోర్గాన్‌.. లక్ష్యాన్ని చేరేదాక బంతిని బౌండరీలు దాటించాడు. స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (12బంతుల్లో 22) 18 ఓవర్లో రెండు సిక్సర్లతో అలరించడంతో లక్ష్యానికి ఇంగ్లండ్‌ మరింత చేరువైంది. ఆ తర్వాత స్టోక్స్‌ ఔటైనా ఎంగ్డీ వేసిన 19 ఓవర్లో కండ్లు చెదిరే రెండు సిక్సర్లతో మోర్గాన్‌ అదరగొట్టాడు. ఈ క్రమంలో 21బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో ఫోర్‌ కొట్టి మోయిన్‌ అలీ (5) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫోర్ల ఖాతా తెరువకుండానే మోర్గాన్‌ ఏడు సిక్సర్లు బాదడం విశేషం.


క్లాసెన్‌ క్లాస్‌ హిట్టింగ్‌ 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ డికాక్‌ (35), బవుమా దూకుడుగా ఆడారు. బవుమా ఆది నుంచి రెచ్చిపోగా కాసేపు నిదానంగా ఆడిన డికాక్‌.. జోర్డాన్‌ వేసిన ఐదో ఓవర్లో మూడు సిక్సర్లతో వాహ్వా అనిపించాడు. అయితే కాసేపు మెరిపించాక స్టోక్స్‌ బౌలింగ్‌లో డికాక్‌ ఔటవడంతో 84 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. బవుమా ఒక్క పరుగు తేడాతో అర్ధశతకం చేజార్చుకొని పెవిలియన్‌ బాట పట్టగా.. క్రీజులోకి వచ్చిన క్లాసన్‌.. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ రషీద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో బాదుడు మొదలెట్టాడు. డసెన్‌ (11) ఔటైనా క్లాసెన్‌ దూకుడు కొనసాగించాడు. మార్క్‌ వుడ్‌ వేసిన  15వ ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 25 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్‌ ఔటయ్యాక మిల్లర్‌ (35) బ్యాట్‌ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా 222 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

సంక్షిప్త స్కోర్లు 

దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 222/6 (క్లాసెన్‌ 66, బవుమా 49; టామ్‌ కరన్‌ 2/33),

ఇంగ్లండ్‌ : 19.1 ఓవర్లలో 226/5 (బెయిన్‌ స్టో 64, బట్లర్‌ 57, మోర్గాన్‌ 57; లుంగీ ఎంగ్డీ 2/55).


logo