గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 11:32:09

రెండోరోజు ముగిసే సమయానికి 51 పరుగుల ఆధిక్యంలో కివీస్‌..

రెండోరోజు ముగిసే సమయానికి 51 పరుగుల ఆధిక్యంలో కివీస్‌..

వెల్లింగ్టన్‌: భారత్‌తో బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య కివీస్‌.. రెండో రోజు ముగిసే సమయానికి 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(89) అద్భుతమైన అర్ధసెంచరీతో రాణించాడు. అతడికి సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌టేలర్‌(44) చక్కటి సహకారాన్ని అందించాడు. తొలివికెట్‌ను త్వరగానే చేజిక్కించుకున్న ఇండియా.. మరో వికెట్‌ తీయడానికి 20 ఓవర్లు తీసుకుంది. సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ(3/31) అద్భుత బంతులతో ఓపెనర్లిద్దరినీ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌.. రాస్‌టేలర్‌ సమయోచిత బ్యాటింగ్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా విలియమ్సన్‌.. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న కివీస్‌ కెప్టెన్‌ను షమీ ఔట్‌ చేశాడు. షాట్‌ ఆడబోయిన కేన్‌.. రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చాడు. మరో పది ఓవర్ల వ్యవధిలో రాస్‌ టేలర్‌ను.. ఇషాంత్‌ పెవిలియన్‌ పంపించాడు. క్రీజులో కుదురుకుంటున్న హెన్రీ నికోల్స్‌ను అశ్విన్‌ బొల్తా కొట్టించాడు. అశ్విన్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడబోయిన నికోల్స్‌.. బంతి హెడ్జ్‌ తీసుకొని సెకండ్‌ స్లిప్స్‌లో విరాట్‌ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో వాట్లింగ్‌(14 నాటౌట్‌), గ్రాండ్‌హోమ్‌(4) ఉన్నారు. ఆట మరో మూడు రోజులు మిగిలి ఉండగా.. కివీస్‌ రెండో రోజు ముగిసే సమయానికి 71.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు.. కివీస్‌ బౌలర్ల ధాటికి 5 వికెట్లు కోల్పోయి, 122 పరుగులు చేసింది. అనంతరం రెండోరోజు ప్రారంభించిన ఇండియా.. తొలి రోజు స్కోరుకు మరో 43 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో వైస్‌ కెప్టెన్‌ రహానే (46 పరుగులు) అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రెండో టాప్‌ స్కోరర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 34 పరుగులు. మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, జెమీసన్‌ నాలుగేసి వికెట్లు పడగొట్టగా, బౌల్ట్‌ 1 వికెట్‌ తీశాడు. 


logo