సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 02:23:07

సీఎస్‌కేలో రైనా దుమారం

సీఎస్‌కేలో రైనా దుమారం

  న్యూఢిల్లీ:  చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)తో సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా ప్రయాణం సందిగ్ధంలో పడింది. 2008 ఐపీఎల్‌ ప్రారంభం నుంచి రెండేండ్లు(సీఎస్కే నిషేధం) మినహా ఆ జట్టులోనే ఉంటూ అత్యధిక పరుగుల వీరుడిగా అతడు అవతరించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ ధోనీని చెన్నై అభిమానులు తలా(నాయకుడు) అని పిలిస్తే రైనాను చిన్నతలా అని ముద్దుగా అంటారు. అయితే ఈ నెల 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగాల్సిన ఈ  సీజన్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్టు హఠాత్తుగా రైనా నిర్ణయించుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు వైదొలిగాడని తొలుత ఫ్రాంచైజీ ప్రకటించినా కారణాలు వేరే ఉన్నాయని స్పష్టమైంది. కరోనా భయంతో రైనా స్వదేశానికి వచ్చేశాడని తొలుత వాదనలు వినిపించినా.. దుబాయ్‌లోని హోటల్‌లో తనకు కేటాయించిన గది విషయంలో అతడి అసంతృప్తే ఇందుకు దారి తీసినట్టు సమాచారం. తన గదికి బాల్కనీ లేదని రైనా అసహనం వ్యక్తం చేయగా.. యాజమాన్యం సహా ధోనీ సర్దిచెప్పినా అతడు పట్టించుకోకుండా స్వదేశానికి వచ్చేశాడట. ఇంత చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకున్న రైనా ప్రవర్తనపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మరి 2021 ఐపీఎల్‌ కోసం రైనాను చెన్నై కొనసాగిస్తుందా.. లేదా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఒక్కో సీజన్‌ కోసం రైనాకు దాదాపు రూ.11కోట్లను చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెల్లిస్తున్నది. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు(193) ఆడిన రికార్డు రైనా పేరిటే ఉంది. చెన్నైపై నిషేధంతో రెండేండ్లు అతడు గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడాడు. మొత్తంగా 10 సీజన్లలో చెన్నై తరఫున 164 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన రైనా 4,527పరుగులతో జట్టులో టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. సీఎస్కే మూడు టైటిళ్లను గెలువడంతో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా కోహ్లీ(5412) తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రైనా(5,368) ఉన్నాడు. 

  రుతురాజ్‌, కరన్‌, ధోనీల్లో ఎవరు..? 

  రైనా ఈ సీజన్‌ నుంచి తప్పుకోవడంతో మూడో స్థానంలో బ్యాట్స్‌మన్‌ కోసం చెన్నై ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నది. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను ప్రోత్సహించి.. రైనా స్థానాన్ని భర్తీ చేయాలని ఫ్రాంచైజీ ఆలోచనగా ఉంది. అయితే ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ఆ స్థానానికి సరిగ్గా సరిపోతాడని కామెంటేటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ అభిప్రాయపడ్డాడు. అయితే మూడో స్థానంలో బరిలోకి దిగేందుకు ధోనీకి ఇది మంచి అవకాశం అని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు.  

శ్రీనివాసన్‌ తొలుత అలా.. తర్వాత మరోలా

  రైనా వ్యవహారంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైనా తనను తాను ఎక్కువ అంచనా వేసుకుంటూ గర్వంగా ప్రవర్తించాడని, ఐపీఎల్‌ నుంచి వైదొలగడంతో డబ్బుతో పాటు ఏం నష్టపోయాడో అతడే తెలుసుకుంటాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రైనా నిష్క్రమణ ప్రభావం జట్టుపై ఏ మాత్రం ఉండదని, ఆ స్థానంలో యువ ఆటగాడు రితురాజ్‌ గైక్వాడ్‌ అదరగొడతాడని శ్రీనివాసన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.  అయితే కొద్ది గంటల్లోనే రైనా విషయంలో కాస్త శాంతించినట్టు మాట్లాడాడు. చెన్నై విజయాల్లో రైనా భాగస్వామ్యం ఎంతో ఉందని, ఎప్పుడూ అతడికి మద్దతుగా ఉంటామని శ్రీనివాసన్‌ చెప్పాడు. ప్రస్తుతం అతడి పరిస్థితిని అర్థం చేసుకొని స్వేచ్ఛనిస్తామన్నాడు.


logo