బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 17, 2020 , 00:04:20

ధోనీకి చుక్కెదురు!

ధోనీకి చుక్కెదురు!
  • -బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన మహీ.. లోకేశ్‌ రాహుల్‌కు ప్రమోషన్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయాడు. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు అమలు పర్చనున్న ఒప్పందంలో ధోనీకి చోటు దక్కలేదు. గతేడాది వరకు గ్రేడ్‌-‘ఎ’లో ఉన్న మహీ.. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత టీమ్‌ఇండియా తరఫున బరిలో దిగని విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించిన జాబితాలో లోకేశ్‌ రాహుల్‌ గ్రేడ్‌-‘బి’ నుంచి గ్రేడ్‌-‘ఎ’కు ప్రమోషన్‌ పొందగా.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా ‘ఎ’ప్లస్‌లో కొనసాగుతున్నారు. గతేడాది కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు అంబటి రాయుడుతో పాటు దినేశ్‌ కార్తీక్‌ ఈ యేడు ఉద్వాసనకు గురయ్యారు. 


నిబంధనల ప్రకారం 38 ఏండ్ల ధోనీకి కాంట్రాక్ట్‌ దక్కక పోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఆరునెలలుగా మైదానంలో అడుగుపెట్టకపోవడంతోనే మహీని జాబితా నుంచి తొలగించినట్లు స్పష్టమవుతున్నది. కానీ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించిన అంశంలో స్పష్టత లేకపోవడంతోనే అసలు చిక్కు వచ్చి పడింది. ధోనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కోహ్లీ, రవిశాస్త్రికి ముందే చెప్పి ఉంటాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అంటుంటే.. ఇకపై వన్డేల్లో మహీ ఆడకపోవచ్చని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శననను బట్టి పొట్టి ప్రపంచకప్‌నకు ధోనీ పేరు పరిశీలిస్తామని మేనేజ్‌మెంట్‌ అంటుంటే.. ఇక వన్డేల నుంచి అతను రిటైరైనట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశం తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.. ఓవరాల్‌గా 17 వేల పైచిలుకు పరుగులు చేయడంతో పాటు, 829 ఔట్లలో పాలు పంచుకున్నాడు.


 ప్రాక్టీస్‌లో ధోనీ

కాంట్రాక్టుల విషయంలో సర్వత్రా చర్చ జరుగుతుంటే.. ధోనీ మాత్రం తనకు అలవాటైన శైలిలో మిన్నకుండిపోయాడు. గురువారం జార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ఓవైపు బీసీసీఐ నిర్ణయాలతో ధోనీ భవితవ్యంపై సందేహాలు తలెత్తుతుంటే.. మరోవైపు ప్రాక్టీస్‌ కోసం మహీ కొత్త బౌలింగ్‌ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. రాంచీ వేదికగా ఉత్తరాఖండ్‌తో ఆదివారం నుంచి ప్రారం భం కానున్న రంజీ మ్యాచ్‌ కోసం జార్ఖండ్‌ జట్టు ప్రాక్టీస్‌ చేస్తుండగా.. ధోనీ చెప్పాపెట్టకుండా అక్కడికి చేరిపోయాడు. కుర్రాళ్లతో కలిసి నెట్స్‌లో శ్రమించిన మహీ.. తెల్లబంతితో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు.


గ్రేడ్‌-ఎ ప్లస్‌ (రూ. 7 కోట్లు) 

కోహ్లీ, రోహిత్‌, బుమ్రా

గ్రేడ్‌-ఎ (రూ. 5 కోట్లు) 

అశ్విన్‌, జడేజా, భువనేశ్వర్‌, పుజారా, రహానే, రాహుల్‌, ధవన్‌, షమీ, ఇషాంత్‌, కుల్దీప్‌, పంత్‌

గ్రేడ్‌-బి (రూ. 3 కోట్లు) 

సాహా, ఉమేశ్‌, చాహల్‌, పాండ్యా, మయాంక్‌

గ్రేడ్‌-సి (రూ. కోటి)

జాదవ్‌, సైనీ, దీపక్‌, మనీశ్‌ పాండే, విహారి, శార్దూల్‌, అయ్యర్‌, సుందర్‌.


 మహీకి ముందే తెలుసా!

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించబోయే విషయం మహీకి ముందే తెలుసనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్నేళ్లుగా ఆటకు దూరంగా ఉండటంతో అతడి పేరును జాబితా నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారులు ముందే చెప్పినట్లు సమాచారం. దిగ్గజ కెప్టెన్‌ను ఆషామాషీగా తొలగించకుండా బీసీసీఐ పెద్ద తలలు అతడితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.


 ముగిసినట్లేనా..!

ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్‌.. వికెట్ల వెనుక ఉసెన్‌ బోల్ట్‌.. ఒత్తిడిని జయించడంలో ఘనాపాటి.. వ్యూహాలు రచించడంలో అతడికి అతడే సాటి.. అలాంటి మహేంద్ర సింగ్‌ ధోనీ భవితవ్యం ప్రస్తుతం డోలాయమానంగా కనిపిస్తున్నది. రనౌట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన మహీ.. అదే రనౌట్‌తో కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తాడా అనే అనుమానాలు రెకెత్తుతున్నాయి. ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండే ధోనీ తన కెరీర్‌ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఈ తరుణంలో కాంట్రాక్ట్‌ నుంచి తప్పించడం ద్వారా బీసీసీఐ 

అతడికి టాటా చెప్పాలని భావిస్తున్నదా అనే సందేహాలు మొదలయ్యాయి. 


వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత టీమ్‌ఇండియా ఆడే ప్రతీ సిరీస్‌కు ముందు ధోనీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. వెస్టిండీస్‌ పర్యటన నుంచి తనకు తానుగానే తప్పుకున్న మహీ సైన్యంలో పనిచేసేందుకు రెండు నెలలు ఆటకు దూరంగా ఉంటానని ముందు ప్రకటించాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ సమయంలో సెలెక్షన్‌కు అందుబాటులో ఉండటం లేదని కబురు పంపాడు. ఆనక టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడింది. ఇలా ప్రతిసారి ధోనీ అంశం చర్చకు రావడం షరా మామూలుగా మారింది. ఒకానొక దశలో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించడం ఖాయం అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ వస్తున్న జార్ఖండ్‌ డైనమైట్‌.. చివరిసారిగా ‘జనవరి వరకు నన్నేమి అడగకండి’ అని అన్నాడు. మరి మహీ అన్న సమయం రానే వచ్చింది. దానికి బలం చేకూర్చుతూ బీసీసీఐ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. ఈ సంకేతాలు ధోనీ వన్డే కెరీర్‌కు తెరదించినట్లేనా అనే సందేహాలకు ఊతమిస్తున్నాయి.

తన కెరీర్‌లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచించని ధోనీ.. వీడ్కోలు విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నాడనే వాదనలు ఎక్కువవుతున్నాయి. ‘మహీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తే.. అతడి ఇంటి ముందు ధర్నాకు దిగుతా’ అని అతడిని వేనోళ్ల పొగిడిన బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌.. తాజాగా సమాచారం ఇవ్వకుండా ధోనీ ఎన్నాళ్లాలా జట్టుకు దూరంగా ఉంటాడు అని ఘాటుగా విమర్శించాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించడానేది నిజమే అయినా.. 38 ఏండ్ల ధోనీలో మునుపటి వాడి లేదనేది నమ్మక తప్పని నిజం.


logo
>>>>>>