టోక్యో: విశ్వక్రీడల పరుగులో జమైకా విజయ పరంపర కొనసాగింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ దేశ మహిళా స్ప్రింటర్లు ఎదురులేని ఆధిపత్యాన్ని చాటారు. 100 మీటర్ల పరుగులో అరుదైన ఘనత సాధించారు. స్వర్ణం, రజతం, కాంస్యం.. ఇలా మూడు పతకాలను జమైకా స్ప్రింటర్లే కైవసం చేసుకున్నారు. వేడి, ఉక్కపోత ఉన్నా సత్తాచాటి ప్రత్యర్థులందరినీ చిరుతల్లా వెనక్కినెట్టారు. శనివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్లో 10.61 సెకన్లలోనే గమ్యాన్ని చేరిన డిఫెండింగ్ చాంపియన్ ఎలైన్ థామ్సన్ హెరా ఒలింపిక్స్ రికార్డు సహా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. పసిడి సాధిస్తుందని అంచనా వేసిన జమైకా స్టార్ షెల్లీ అన్ఫ్రేజర్ ప్రిస్ 10.74 సెకన్లలో గీతను దాటి రజతం దక్కించుకుంటే.. ఆమె కంటే 0.02 సెకన్ల రెప్పపాటు ఆలస్యమైన షెరికా జాక్సన్ కాంస్యం పట్టింది. ఇలా ముగ్గురు జమైకా స్ప్రింటర్లు పోడియం అధిరోహించారు. సెమీస్‌లో 10.73 సెకన్లతో అన్ఫ్రేజర్ సత్తాచాటితే.. మరో గ్రూప్ సెమీస్‌లో థామ్సన్ 10.76 సెకన్లతో అదరగొట్టింది. అయితే ఫైనల్‌కు వచ్చేసరికి థామ్సన్ అద్భుతం చేసి మహిళల పరుగు చరిత్రలోనే రెండో అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసింది. ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జోనెర్ (1988, 10.49 సెకన్లు) తర్వాతి స్థానంలో నిలిచింది. కాగా జోనెర్ పేరిట ఉన్న ఒలింపిక్స్ రికార్డును మాత్రం 0.01 తేడాతో థామ్సన్ బద్దలుకొట్టింది.