తొలిరౌండ్లో రఫా గెలుపు.. ఫ్రెంచ్ ఓపెన్
మట్టికోర్టు రారాజు రఫేల్ నాదల్ తనకు అచ్చొచ్చిన గడ్డపై సమరాన్ని అలవోక విజయంతో ఆరంభించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుపై కన్నేసిన ఈ స్పెయిన్ వీరుడు ఫ్రెంచ్ ఒపెన్ రెండో రౌండ్‌కు చేరాడు. ఆరోసీడ్ రుబ్లేవ్కు షాక్ ఎదురవగా.. మహిళల సింగిల్స్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, టాప్ ర్యాంకర్ బార్టీ తొలి రౌండ్లో సునాయాసంగా గెలిచారు. ఇక మానసిక ఆందోళన కారణంగా రెండో ర్యాంకర్ నవోమీ ఒసాక టోర్నీ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది.
పారిస్: పురుషుల సింగిల్స్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడిగా అవతరించడంపై కన్నేసిన స్పెయిన్ వీరుడు రఫేల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్‌ను సునాయాస విజయంతో ఆరంభించాడు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్లో రఫా 6-3, 6-2, 7-6 (7/3) తేడాతో అలెక్సీ పోపిరిన్ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో గెలిచాడు. 2 గంటల 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో రఫా 7 ఏస్‌లు, 28 విన్నర్లు సంధించడం సహా ప్రత్యర్థి సర్వీస్‌ను 4 సార్లు బ్రేక్ చేశాడు. 13సార్లు ఫ్రెంచ్ ఓపెన్ సహా మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ప్రస్తుతం స్విస్ దిగ్గజం ఫెదరర్‌తో నాదల్ సమానంగా ఉన్నాడు. కాగా ఆరో సీడ్ ఆండీ రుబ్లేవ్ (రష్యా)కు తొలి రౌండ్లోనే షాక్ ఎదురైంది. ఐదుసెట్ల పాటు పోరాడి రుబ్లేవ్ 3-6, 6-7 (6/8), 6-4, 6-3, 4-6 తేడాతో జాన్ లెనార్డ్స్టఫ్ (జర్మనీ) చేతిలో ఓడాడు.
సెరెనా సునాయాసంగా..
అమెరికా స్టార్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్, టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ చేరారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 7-6 (8/6), 6-2 తేడాతో ఇరినా కమెలియా బెగు (రొమేనియా)పై అలవోకగా గెలిచింది. ఈ టోర్నీలో అయినా టైటిల్ సాధించి.. మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల (24) రికార్డును సమం చేయాలని సెరెనా పట్టుదలగా ఉంది. మరో మ్యాచ్‌లో బార్టీ 6-4, 3-6, 6-2తో బెరండా పెరా (అమెరికా)పై గెలిచింది. ఐదో సీడ్ ఎలినా స్వితోలినా, మారియా సకారి, జెన్నిఫర్ బ్రాడీ కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. కాగా సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది.
బోపన్న జోడీ ముందంజ
భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో రెండో రౌండ్‌కు చేరాడు. తొలి రౌండ్లో బోపన్న-ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) ద్వయం 6-4, 6-2తో నికోలోజ్ బసిలాస్విల్ (జార్జియా)-ఆండ్రె బెంజిమన్ (జర్మనీ) జంటపై వరుస సెట్లలో గెలిచింది.
జపాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ రెండో ర్యాంకర్ నవోమీ ఒసాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. మానసిక ఆందోళన వల్ల టోర్నీలో ఇక కొనసాగలేనని స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ఫ్రెంచ్ టోర్నీలో మీడియా సమావేశాలను బహిష్కరించానని ఒసాక ప్రకటించింది. తొలి రౌండ్‌కు ముందు, గెలిచాక కూడా నవోమీ మీడియాతో మాట్లాడలేదు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానాతో పాటు మళ్లీ ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఒసాక ఏకంగా టోర్నీ నుంచే తప్పుకుంది. ‘ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. నేను తప్పుకోవడమే టోర్నీకి, ఇతర ప్లేయర్లకు మంచిదని అనుకుంటున్నా. పారిస్‌లో అందరి దృష్టి ఆట మీద ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. 2018 యూఎస్ ఓపెన్ నుంచి మానసిక ఆందోళనకు గురవుతున్నా. దాని నుంచి బయట పడేందుకు చాలా కష్టపడ్డా. నేను బహిరంగంగా ఎక్కువగా మాట్లాడలేను. ప్రస్తుతం పారిస్‌లోనూ మీడియా సమావేశంలో పాల్గొనాలంటే కుంగుబాటుగా అనిపించింది అని ఒసాక ట్వీట్ చేసింది.