గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 19, 2020 , 02:34:09

డ్రీమ్‌' గెలిచింది

డ్రీమ్‌' గెలిచింది

  • ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11.. 
  • రూ.222కోట్లకు ఈ ఏడాది హక్కులు సొంతం 

ఉత్కంఠకు తెరపడింది. కొన్ని రోజులుగా ఆసక్తి కల్గిస్తున్న ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ అంశం ఒక కొలిక్కి వచ్చింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ హక్కులను  డీమ్‌ 11 కంపెనీ రూ. 222 కోట్లతో దక్కించుకుంది. తుది బిడ్డింగ్‌కు టాటా కంపెనీ దూరంగా ఉండగా, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థలు బైజూస్‌, అన్‌అకాడమీ..  డ్రీమ్‌ ఎలెవన్‌కు తగిన పోటీనివ్వలేకపోయాయి. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో చైనా మొబైల్‌ కంపెనీ వివో ఈ యేడాది తప్పుకోగా, ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌కు కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. 


 న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను ఫాంటసీ గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 దక్కించుకుంది. మంగళవారం రూ. 222 కోట్లకు బిడ్‌ వేసిన ఆ సంస్థ ఈ ఏడాది ఐపీఎల్‌లో వివో స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ పాలక మండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. రెండేండ్లుగా ఐపీఎల్‌ స్పాన్సర్లలో డ్రీమ్‌ 11 ఒకటిగా ఉంది. బిడ్డింగ్‌లో ఆ సంస్థ తర్వాతి స్థానంలో ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీలు బైజూస్‌ (రూ.201కోట్లు), అన్‌అకాడమీ (రూ.170 కోట్లు) నిలిచాయి. అయితే టైటిల్‌ హక్కులపై ఆసక్తి కనబరిచిన ప్రముఖ సంస్థ టాటా గ్రూప్స్‌ బిడ్డింగ్‌కు దూరంగా ఉంది. భారతీయ సంస్థ డ్రీమ్‌ 11ను హర్ష్‌ జైన్‌, భవిత్‌ సేత్‌ స్థాపించారు. ఆ సంస్థలో దాదాపు 400మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గల్వాన్‌ ఘటన తర్వాత దేశ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పెరుగడంతో భారత్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఉద్యమం ఉధృతమైంది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా  ఐదేండ్ల ఒప్పందం (2018-22) ప్రకారం బీసీసీఐకి ఏడాదికి రూ.440కోట్లు చెల్లించిన మొబైల్‌ తయారీ సంస్థ వివో ఈ ఏడాదికి తప్పుకుంది. అయితే వివో ఒప్పందం ఇంకా 2022 వరకు ఉంది. దీంతో ఈ ఏడాది టైటిల్‌ హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించగా డ్రీమ్‌ 11 చేజిక్కించుకుంది. వచ్చే నెల 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈ వేదికగా ఈ ఏడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరుగనుంది. ‘డ్రీమ్‌ 11లో కలారీ క్యాపిటల్‌ సహా పలు భారతీయ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. ఈ సంస్థలో 10శాతం లోపు పెట్టుబడులు మాత్రమే టెన్‌సెంట్‌(చైనా) సంస్థవి. ఈ యాప్‌ కేవలం భారతీయల కోసం తయారు చేసిందే’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఎక్కువ మొత్తానికి బిడ్‌ వేసినా వివిధ అంశాలను పరిగణించాకే హక్కులను కేటాయిస్తామని బీసీసీఐ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 

  సగం ధరకే.. 

  టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న వివో ఏడాదికి దాదాపు రూ.440కోట్లు చెల్లించగా.. ఈ ఏడాదికి డ్రీమ్‌ 11 రూ.222కోట్లకు దక్కించుకుంది. దీంతో బీసీసీఐకి దాదాపు సగం ఆదాయం పడిపోయింది. ‘ప్రస్తుత ఆర్థిక వాతారణంలో వివోకు సమానమైన బిడ్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదు కూడా. టాటా గ్రూప్‌ ఆసక్తిని కనబరిచినా బిడ్‌ వేయలేదు. ఆ సంస్థ బిడ్‌ వేయాలని బీసీసీఐ కోరుకున్నా అలా జరుగలేదు’ అని వ్యాపార విశ్లేషకుడు ఒకరు చెప్పారు. అయితే సెంట్రల్‌ స్పాన్సర్‌షిప్‌ పూల్‌లోకి ఈ ఏడాది అన్‌అకాడమీ, పేమెంట్స్‌ యాప్‌ క్రెడ్‌ రావడంతో బీసీసీఐకి నష్టాలు కాస్త తగ్గుతాయని ఓ అధికారి చెప్పారు. నాలుగున్నర నెలలకే డ్రీమ్‌ 11 రూ.222కోట్లు చెల్లిస్తుండడం బీసీసీఐకి మంచి ఒప్పందమమేనని బోర్డుకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. 


logo