శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 06, 2020 , 00:38:59

తిప్పేసిన సోఫీ

తిప్పేసిన సోఫీ

  • 4 వికెట్లతో సత్తాచాటిన ఎక్లెస్టోన్‌ 
  • వెలాసిటీపై ట్రైల్‌బ్లేజర్స్‌ ఘన విజయం 

షార్జా: స్పిన్నర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌(3.1-1-9-4) సంచలన బౌలింగ్‌ ప్రదర్శనతో ట్రైల్‌బ్లేజర్స్‌ అదిరిపోయే బోణీ కొట్టింది. టీ20 చాలెంజ్‌    (మహిళల ఐపీఎల్‌)లో భాగంగా గురువారం  జరిగిన మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌ 9 వికెట్ల తేడాతో మిథాలీరాజ్‌ నేతృత్వంలోని వెలాసిటీపై ఘన విజయం సాధించింది. ఎక్లెస్టోన్‌తో పాటు జులన్‌ గోస్వామి (2/13), రాజేశ్వరి గైక్వాడ్‌ (2/13) బౌలింగ్‌ విజృంభణతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ 15.1 ఓవర్లలోనే 47 పరుగులకు ఆలౌటైంది. 17 పరుగుల వద్ద యువ సంచలనం షెఫాలీ వర్మ(13)ను ట్రైల్‌బ్లేజర్స్‌ సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి ఔట్‌ చేయడంతో వెలాసిటీ పతనం ఆరంభమైంది. ఆ తర్వాత మిథాలీ (1), వేదా కృష్ణమూర్తి(0),  సుష్మా వర్మ(1)ను ఎక్లెస్టోన్‌ ఔట్‌ చేసింది. ఈ క్రమంలో డానియెల్‌ వ్యాట్‌(3)ను గోస్వామి పెవిలియన్‌ పంపింది. శిఖ(10), గత మ్యాచ్‌ స్టార్‌ సునే లీస్‌(4) విఫలమయ్యారు. మొత్తం గా వెలాసిటీలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని ట్రైల్‌బ్లేజర్స్‌ 7.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్‌ స్మృతి మంధాన(6) త్వరగానే ఔటైనా డాటిన్‌(29 నాటౌట్‌), రిచా ఘోష్‌(13 నాటౌట్‌) వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. 

సంక్షిప్త స్కోర్లు 

వెలాసిటీ: 15.1 ఓవర్లలో 47 ఆలౌట్‌ (షెఫాలీ వర్మ 13; ఎక్లెస్టోన్‌ 4/9). 

ట్రైల్‌బ్లేజర్స్‌: 7.5 ఓవర్లలో 49/1 

(డాటిన్‌ 29 నాటౌట్‌; కాస్పెరెక్‌ 1/5)

 మహిళల టీ20 చాలెంజ్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు(47) నమోదు చేసిన జట్టుగా వెలాసిటీ చెత్త రికార్డును మూటగట్టుకుంది.