బుధవారం 08 జూలై 2020
Sports - May 08, 2020 , 00:12:22

నేను దురదృష్టవంతుడిని కాదు: పార్థివ్​

నేను దురదృష్టవంతుడిని కాదు: పార్థివ్​

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ ఉన్న తరంలో ఆడుతున్నందుకు తానేం దురదృష్టవంతుడిగా భావించడం లేదని టీమ్​ఇండియా సీనియర్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. భారత జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ధోనీ కంటే ముందే తనకే అవకాశం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశాడు.

2002లోనే 17ఏండ్ల వయసులో ఇంగ్లం​డ్​పై టెస్టుతో టీమ్​ఇండియా తరఫున పార్థివ్ పటేల్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత ధోనీ భారత జట్టులో వచ్చి.. అదరగొట్టడంతో పార్థివ్ చోటు కోల్పోయాడు. అడపాదడపా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు పార్థివ్ తన కెరీర్​లో భారత జట్టు తరఫున 25టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. దీంతో ధోనీ వల్లే పార్థివ్​కు అవకాశాలు రాలేదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై పార్థివ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

“ధోనీ ఉన్న కాలంలో నేను ఆడుతుండడాన్ని దురదృష్టంగా అనుకోవడం లేదు. ఎందుకంటే అతడి కంటే ముందే నా కెరీర్​ మొదలైంది, అవకాశం వచ్చింది. నేను రెండు సిరీస్​ల్లో సరైన ప్రదర్శన చేయని కారణంగా టీమ్​ఇండియాలోకి ధోనీ వచ్చాడు. కేవలం సానుభూతిని పెంచేందుకే కొందరు నాది దురదృష్టమని అంటారు. కానీ నేను దాన్ని నమ్మను. ధోనీ సాధించిన విజయాలు చాలా ప్రత్యేకమైనవి. అతడు అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టే విజయాలు సాధించగలిగాడు. నేను ఈ విషయంలో దురదృష్టవంతుడిని కానేకాదు” అని పార్థివ్ చెప్పాడు. టెస్టులకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాక కొన్ని మ్యాచ్​ల్లో పార్థివ్​కు టీమ్​ఇండియాలో చోటు దక్కినా ఆ తర్వాత మళ్లీ దూరమయ్యాడు. 


logo