శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 00:24:13

10నెలల తర్వాత..

10నెలల తర్వాత..

  • దేశవాళీ క్రికెట్‌ షురూ.. నేటి నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 
  • ఐపీఎల్‌ వేలం నేపథ్యంలో కీలకంగా టోర్నీ

ముంబై: దాదాపు 300 రోజుల అనంతరం దేశవాళీ క్రికెట్‌ సీజన్‌కు రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ వల్ల గతేడాది మార్చి లో నిలిచిపోయిన డొమెస్టిక్‌ క్రికెట్‌.. ఆదివారం మొదల వనున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో మళ్లీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో ఐపీఎల్‌ వేలం జరుగనున్న నేపథ్యంలో ఈ టీ20 దేశవాళీ లీగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ఆటగాళ్ల వేటలో ఉన్న ఫ్రాంచైజీలు టోర్నీలో ప్రతిభను పట్టేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా ధవన్‌ (ఢిల్లీ), రైనా (ఉత్తరప్రదేశ్‌), ఇషాంత్‌ (ఢిల్లీ) లాంటి టీమ్‌ఇండియా స్టార్లు ముస్తాక్‌ అలీ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఏడేండ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న శ్రీశాంత్‌  కేరళ తరఫున ఆడనున్నాడు. 

ఆరు బయోబబుల్‌ వేదికలు

కరోనా వైరస్‌ ప్రమాదం ఉండడంతో మొత్తం గ్రూప్‌ దశ మ్యాచ్‌ల కోసం ఆరు వేదికల్లో బీసీసీఐ కట్టుదిట్టంగా బయోబబుల్‌లు ఏర్పాటు చేసింది. ఎలైట్‌,  ప్లేట్‌ మొత్తం ఆరు గ్రూప్‌లుగా విభజించగా.. ఒక్కో ఎలైట్‌ గ్రూప్‌లో ఆరేసి జట్లు ఉన్నాయి. ముంబై, వడోదర, ఇండోర్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వేదికగా గ్రూప్‌ దశ మ్యాచ్‌లు..  అహ్మదాబాద్‌లో నాకౌట్‌ పోటీలు జరుగనున్నాయి.  ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉన్న హైదరాబాద్‌ జట్టు కోల్‌కతాలో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీ విజయవంతమైతే ఆ తర్వాత విజయ్‌ హజారే, రంజీ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నది.  

యువకులకు అవకాశం 

ఐపీఎల్‌ వేలానికి ముందు జరుగుతున్న ముస్తాక్‌ అలీ టోర్నీలో సత్తాచాటి ఫ్రాంచైజీలను ఆకర్షించాలని యువ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌, ప్రియంగార్గ్‌, యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబే, సర్ఫరాజ్‌ ఖాన్‌, సాయి కిశోర్‌, రవి బిష్ణోయ్‌, తిలక్‌ వర్మ, సిద్ధార్థ్‌పై అందరి దృష్టి ఉండనుంది. 

ఎలైట్‌ గ్రూప్‌-బి: హైదరాబాద్‌ (వేదిక - కోల్‌కతా) ఒడిశా, బెంగాల్‌, జార్ఖండ్‌, తమిళనాడు, అసోం

హైదరాబాద్‌ షెడ్యూల్‌ 

జనవరి 10: హైదరాబాద్‌ X అసోం 

జనవరి 12: హైదరాబాద్‌ X  ఒడిశా 

జనవరి 14: హైదరాబాద్‌ X బెంగాల్‌ 

జనవరి 16: హైదరాబాద్‌  X తమిళనాడు

జనవరి 18: హైదరాబాద్‌ X జార్ఖండ్‌  


logo