శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 02, 2020 , 21:18:02

ఆస్ట్రేలియా ఓపెన్‌ కైవసం చేసుకున్న జొకోవిచ్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ కైవసం చేసుకున్న జొకోవిచ్‌

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సంచలనం, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. నొవాక్‌ రికార్డు స్థాయిలో 8 సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవడం గమనర్హం. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్‌ థీమ్‌తో జరిగిన హోరాహోరి ఫైనల్‌ పోరులో జొకోవిచ్‌ విజయం సాధించాడు. ఐదు సెట్ల పాటు సాగిన ఈ గేమ్‌లో మొదటి సెట్‌ను 6-4తో గెలుచుకున్న నొవాక్‌.. తదుపరి రెండు సెట్లు 4-6, 2-6 తేడాతో కోల్పోయాడు. అనంతరం, తన అనుభవాన్నంతా రంగరించి, 6-3, 6-4తో వరుస సెట్లతో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. నాలుగు గంటల పాటు ఈ మ్యాచ్‌ కొనసాగడం విశేషం. 

ఈ గ్రాండ్‌స్లామ్‌ జొకోవిచ్‌ కేరీర్‌లో 17వది. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచిన ఆటగాళ్లలో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్‌ విజయంతో నొవాక్‌ నెం. 1 ర్యాంక్‌ సైతం సొంతం చేసుకున్నాడు. నొవాక్‌, థీమ్‌ తలపడిన 10 మ్యాచ్‌ల్లో 6-4తో నొవాక్‌ ముందంజలో ఉన్నాడు. ఈ సందర్భంగా నొవాక్‌ జొకోవిచ్‌ మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఇది నా ఫేవరెట్‌ కోర్ట్‌. నాకిష్టమైన స్టేడియం కూడా అని తెలిపాడు. తనకు మద్దతు తెలిపిన అభిమానులందరికీ ఈ సందర్భంగా అతను ధన్యవాదాలు తెలిపాడు. ఎనిమిది అంతకన్నా ఎక్కువ ఒకే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన వారిలో నొవాక్‌.. ఫెదరర్‌(8 వింబుల్డన్‌ టైటిల్స్‌)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. వీరి కన్నా ముందు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ 12 సార్లు గెలిచాడు. 


logo