న్యూయార్క్: ఈ ఏడాది క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించాలనే పట్టుదలతో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ ఆ దిశగా తొలి అడుగు వేశాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జకో అలవోక విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. జొకోవిచ్ 6-1, 6-7 (5), 6-2, 6-1 తేడాతో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలుపొందాడు. రెండో సెట్లో వెనుకబడ్డా తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని చిత్తు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో 18 ఏండ్ల రూనె ఓడినా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. రెండో సెట్లో అతడు జొకోను ఓడించగానే స్టేడియం చప్పట్లతో మార్మోగిపోయింది.
మహిళల సింగిల్స్‌లో స్టార్ టెన్నిస్ ప్లేయర్లు ఒసాకా (జపాన్), ఆష్ బార్టీ (ఆస్ట్రేలియా), చెక్‌రిపబ్లిక్ ప్లేయర్లు క్విటోవా, కరోలినా ప్లిస్కోవా ముందంజ వేశారు. వరల్డ్ నంబర్ ఫోర్ ప్లిస్కోవా 6-3, 6-4తో మెక్న్యాలీ(అమెరికా)పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు క్విటోవా6-1, 6-2తో పొలొన(స్లోవేనియా)పై గెలిచింది.
మూడో రౌండ్‌కు ఒసాకా
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరగాల్సిన రెండో రౌండ్ మ్యాచ్ నుంచి ఆమె ప్రత్యర్థి ఓల్గా డనిలోవిచ్ (సెర్బియా) అనారోగ్య కారణాల వల్ల తప్పుకోవడంతో ఒసాకా ముందడుగు వేసింది.