శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 19, 2021 , 02:38:39

మళ్లీ నిరాశే

మళ్లీ నిరాశే

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌  సెమీస్‌లో సెరెనా పరాజయం 
  • ఒసాక చేతిలో వరుస సెట్లలో ఓటమి 
  • తుదిపోరుకు బ్రాడీ, జొకోవిచ్‌ 

టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ కల మరోసారి చెదిరింది. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును సమం చేయాలన్న ఆమె నాలుగేండ్ల నిరీక్షణ మళ్లీ నిష్ఫలమైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌లో నవోమీ ఒసాక చేతిలో ఓడాక సెరెనా కన్నీరు పెట్టుకుంది. ఇక అంతా అయిపోయిందంటూ మీడియా సమావేశంలో నిట్టూర్చింది. ముచోవాపై నెగ్గి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరులో అడుగుపెట్టిన బ్రాడీతో టైటిల్‌ పోరులో మూడో సీడ్‌ ఒసాక తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదిసార్లు ఆస్ట్రేలియా విజేత జొకోవిచ్‌ మరోసారి ఫైనల్‌ చేరాడు. 

మెల్‌బోర్న్‌: అమెరికా స్టార్‌ ప్లేయర్‌, 23 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల విజేత సెరెనా విలియమ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌ చరిత్రలో మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (24) రికార్డు సమం చేయాలన్న కల మళ్లీ చెదిరింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్స్‌లో పరాజయం పాలై.. నాలుగేండ్ల మేజర్‌ టైటిల్‌ నిరీక్షణకు తెరదించలేకపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో 10వ సీడ్‌ సెరెనా 3-6, 4-6 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్‌ నవోమీ ఒసాక (జపాన్‌) చేతిలో ఓడింది. మ్యాచ్‌లో 12 విన్నర్లు బాదిన సెరెనా అంతకు రెట్టింపుగా 24 తప్పిదాలు చేసి వెనుకబడింది. అంతా అయిపోయింది అంటూ మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో సెరెనా భావోద్వేగానికి గురైంది. కన్నీటితో డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయింది. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గాక.. విలియమ్స్‌ మరో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో విజేతగా నిలువలేకపోయింది. రెండో సీడ్‌ హలెప్‌ను క్వార్టర్స్‌లో ఓడించి ఈసారి దూకుడు మీద కనిపించినా టైటిల్‌కు రెండడుగుల దూరంలోనే ప్రయాణం ముగించింది. మరో సెమీస్‌లో 22వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా) 6-4, 3-6, 6-4 తేడాతో 27వ ర్యాంకర్‌ కరోలినా ముచోవా (చెక్‌రిపబ్లిక్‌)పై గెలిచింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ చేరడం బ్రాడీకి ఇదే తొలిసారి.  మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం యూఎస్‌ ఓపెన్‌ చాంప్‌ ఒసాకతో బ్రాడీ తలపడనుంది. 

జొకో తొమ్మిదోసారి 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ చేరిన ఎనిమిదిసార్లు టైటిల్‌ కైవసం చేసుకున్న ప్రపంచ అగ్రర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి తుదిపోరుకు చేరాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అడుగుపెట్టిన తొలిసారే సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన క్వాలిఫయర్‌ అస్లాన్‌ కరత్సెవ్‌ (రష్యా)పై 6-3, 6-4, 6-2 తేడాతో సెర్బియా వీరుడు జొకో గెలిచాడు. శుక్రవారం డానిల్‌ మద్వెదెవ్‌, స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ సెమీస్‌ జరుగనుండగా.. ఆ మ్యాచ్‌ విజేతతో జొకో టైటిల్‌ కోసం పోటీ పడనున్నాడు.  

పురుషుల సింగిల్స్‌ సెమీస్‌ మద్వెదెవ్‌ x సిట్సిపాస్‌

మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ (శనివారం)బ్రాడీ x ఒసాక 

VIDEOS

logo