బుధవారం 08 జూలై 2020
Sports - Apr 24, 2020 , 00:14:50

ధోనీ ఎంపికతో ఆశ్చర్యపోయా

ధోనీ ఎంపికతో ఆశ్చర్యపోయా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ తొలి సీజన్‌(2008) వేలంలో తనను కాదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ మహేంద్ర సింగ్‌ ధోనీని ఎంపిక చేసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. ఆ సమయంలో తమిళనాడు నుంచి తానే ప్రముఖ ఆటగాడిగా ఉన్నానని, అయినా చెన్నై యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధించిందని గురువారం ఓ ఇంటర్వ్యూలో దినేశ్‌ వెల్లడించాడు.‘2008లో మేం ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో ఐపీఎల్‌ వేలం జరిగింది. నేను అప్పుడు తమిళనాడు తరఫున ప్రముఖ ఆటగాడిగా ఉన్నా. టీమ్‌ఇండియాకు కూడా ఆడుతున్నా. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ నన్ను తప్పక ఎంపిక చేసుకుంటుందని అనుకున్నా. అయితే కెప్టెన్సీ ఇస్తారా లేదా అనే సందేహం ఒక్కటే ఉండేది. కానీ మొదట చెన్నై 1.5మిలియన్‌ డాలర్లు(అప్పుడు దాదాపు రూ.6కోట్లు) వెచ్చించి ధోనీని దక్కించుకుంది. అప్పుడు మహీ నా పక్కనే ఉన్నాడు. ఆ తర్వాతైనా నన్ను సీఎస్కే తీసుకుంటుందనుకున్నా. కానీ అలా జరుగకపోవడం నన్ను బాధించింది. ఇప్పటికి 13 సంవత్సరాలైంది.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తున్నా’ అని కార్తీక్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌(ప్రస్తుతం క్యాపిటల్స్‌), కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌కు ఆడిన దినేశ్‌ కార్తీక్‌ ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 


logo