సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 10, 2020 , 17:31:32

KXIP vs KKR: గిల్‌, కార్తీక్‌ మెరుపులు..

KXIP vs KKR: గిల్‌,  కార్తీక్‌  మెరుపులు..

అబుదాబి:  ఐపీఎల్‌-13లో  భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా  నైట్‌రైడర్స్‌  సాధారణ స్కోరుకే పరిమితమైంది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(57: 47 బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(58: 29 బంతుల్లో  8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆరంభం నుంచి పంజాబ్‌ బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతా పోరాడే స్కోరే చేసింది.  పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌(1/25), రవి బిష్ణోయ్‌(1/25),  మహ్మద్‌ షమీ(1/30) బ్యాట్స్‌మెన్‌ను నిలువరించారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న  కోల్‌కతా  పవర్‌ప్లే కూడా ముగియకుండానే  రెండు కీలక వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, యువ ఆటగాడు  గిల్‌  ఆదుకోవడంతో గౌరవప్రద స్కోరు చేయగలిగింది. 12 పరుగుల వద్ద రాహుల్‌ త్రిపాఠి ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ వేసిన మూడో ఓవర్లో రాహుల్‌ బౌల్డయ్యాడు. అర్షదీప్‌ సింగ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో నితీశ్‌ రాణా   అనూహ్యంగా రనౌటయ్యాడు. పవర్‌ప్లేలో కోల్‌కతా స్కోరు  25/2.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇయాన్‌ మోర్గాన్‌ ఎక్కువ సేపు నిలువలేదు. యువ స్పిన్నర్‌ బిష్ణోయ్‌ అతన్ని పెవిలియన్‌ పంపాడు.  

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన కార్తీక్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేసిన అర్షదీప్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాది 14 రన్స్‌ రాబట్టిన కార్తీక్‌.. జోర్డాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో  రెండు ఫోర్లు, సిక్సర్‌ కొట్టడంతో  18 పరుగులు సాధించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.   షమీ వేసిన 18వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది హాఫ్‌సెంచరీ సాధించాడు. పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కార్తీక్‌  22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.  అదే ఓవర్‌లో నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ రనౌటయ్యాడు.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విధ్వంసకర క్రికెటర్‌ ఆండ్రూ రస్సెల్‌(5) నిరాశపరిచాడు.  ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్‌ కట్టుదిట్టంగా  బంతులేయడంతో కార్తీక్‌ క్రీజులోనే ఉన్నా ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించలేకపోయింది.