శనివారం 08 ఆగస్టు 2020
Sports - Aug 02, 2020 , 00:37:03

జీవితంలో కష్టాలు శాశ్వతం కాదు. మనో నిబ్బరం, సంకల్ప బలం ఉంటే అనుకున్నది సాధించొచ్చు

జీవితంలో కష్టాలు శాశ్వతం కాదు. మనో నిబ్బరం, సంకల్ప బలం ఉంటే అనుకున్నది సాధించొచ్చు

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: ‘జీవితంలో కష్టాలు శాశ్వతం కాదు. మనో నిబ్బరం, సంకల్ప బలం ఉంటే అనుకున్నది సాధించొచ్చు. విధినైనా ఎదిరించొచ్చు’  ఈ మాటలు ఎందరో క్రీడాకారులు అక్షర సత్యాలని నిరూపించారు. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అంతులేని కష్టాల కడలిని దాటి గెలుపు తీరాలను చేరారు.

 ప్రమాదకర వ్యాధులను జయించి, ధైర్యం నింపారు. విజయాలకు కష్టాలు ఫుల్‌స్టాప్‌ పెట్టలేవని నిరూపించారు. అలాంటి వారిలో కొందరి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలపై ప్రత్యేక కథనం..  

పోలియోను ఎదుర్కొని.. 

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన తొలి అమెరికన్‌ మహిళగా 1960లో విల్మా రుడాల్ఫ్‌ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అయితే ఇంత గొప్ప విజ యం సాధించిన ఆమె చిన్నతనంలో పోలియోతో బాధపడిందంటే ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకు మించిన కష్టాలు కూడా ఆమె జీవితంలో ఎన్నో. వాళ్ల తండ్రికి రుడాల్ఫ్‌ 20వ సంతానం. ఐదేండ్ల వయసులోనే ఆమె పోలియో బారిన పడి నడవలేకపోయింది. న్యూమోనియా, తీవ్రమైన దగ్గు తదితర వ్యాధులతో బాధపడింది. పోలియో మహమ్మారి నుంచి కోలుకున్నా.. ఎడమ కాలిలో బలం పూర్తిగా తగ్గిపోయింది. 12ఏండ్ల వరకు కాలికి పట్టీ వేసుకొనే రుడాల్ఫ్‌ నడిచింది. అయితే ఆ తర్వాత రెండేండ్ల పాటు తీవ్రమైన చికిత్స తీసుకున్న ఆమె మామూలుగా నడవడం ప్రారంభించింది. ఆ తర్వాత మనో సంకల్పం, పట్టుదలతో పరుగును ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో పతకాలతో చరిత్ర సృష్టించి, గొప్ప అథ్లెట్‌గా పేరుగడించింది. 

ఫెల్ప్స్‌.. మానసిక వ్యాధిని ఓడించి

మైకేల్‌ ఫెల్ప్స్‌.. ఆల్‌టైం గ్రేట్‌ స్మిమ్మర్‌. ఒకే ఒలింపిక్స్‌(బీజింగ్‌ 2008)లో ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించి, ఎవరూ కనీసం ఊహించని రికార్డులను సృష్టించాడు. మొత్తంగా ఈత కెరీర్‌లో 19 ఒలింపిక్‌ పతకాలు(15 స్వర్ణాలు) దక్కించుకున్నాడు.  ఇన్ని ఘనతలు సాధించిన ఫెల్ప్స్‌ చిన్నతనంలో ఏడీహెచ్‌డీ(హఠాత్తుగా అసాధారణంగా, వింతగా ప్రవర్తించడం, ఏకాగ్రత లేకపోవడం) అనే మానసిక వ్యాధితో తీవ్రంగా బాధపడ్డాడు. ఎంతో కాలం చికిత్స తీసుకున్నాడు. 

క్యాన్సర్‌ను జయించి..

యువరాజ్‌ సింగ్‌.. భారత క్రికెట్‌ జట్టులో స్టార్‌ ఆల్‌రౌండర్‌గా వెలుగొందాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను టీమ్‌ఇండియా దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011 విశ్వటోర్నీ మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచి.. కెరీర్‌లో అత్యున్నత స్థాయిని అనుభవిస్తున్న తరుణంలో ఆ ఏడాది నవంబర్‌లోనే పిడుగులాంటి వార్త ప్రపంచానికి తెలిసింది. అదే యువరాజ్‌ సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని. అయితే ప్రపంచకప్‌ సమయంలోనే తనకు లక్షణాలు కనిపించాయని, 2011 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనలోనే రక్త వాంతులు అయ్యాయని చెప్పి యువీ షాక్‌కు గురి చేశాడు. కాగా క్యాన్సర్‌ చికిత్స కోసం 2012 ఏడాది ప్రారంభంలో యువీ అమెరికాకు వెళ్లాడు. మూడు దశల కీమోథెరపీ తీసుకొని క్యాన్సర్‌ నుంచి ఆ ఏడాది ఏప్రిల్‌లోనే బయటపడ్డాడు. 2012 ఆగస్టులోనే జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మళ్లీ టీమ్‌ఇండియాలో అడుగుపెట్టి.. పోరాట యోధుడిగా పేరు సంపాదించాడు. గతేడాదే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

పక్షవాతం నుంచి ఒలింపిక్స్‌ పతకం వరకు.. 

భారత పారా అథ్లెట్‌ దీపామాలిక్‌ జీవితం ఆసాంతం స్ఫూర్తిదాయకం. పారాలింపిక్స్‌(రియో 2016, రజతం)లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. దీపా వెన్నెముక సమీపంలో కణతి ఉన్నట్టు 1999 బయటపడింది. దీంతో చికిత్స కోసం 14ఏండ్లలో ఆమె మూడు శస్త్ర చికిత్సలు, 183కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. తొలి శస్త్ర చికిత్స చేయించునే నాటికే దీపా మాలిక్‌కు ఇద్దరు పిల్లలు. దీప భర్త కార్గిల్‌ యుద్ధంలో పోరాడుతున్నారు. అయితే ఈ కష్టాలు, బాధలు మాలిక్‌ను మరింత రాటు దేల్చాయి. పక్షవాతం కారణంగా మళ్లీ నడవలేవని డాక్టర్లు చెప్పినా.. కచ్చితంగా అథ్లెట్‌ కావాలని 36 ఏండ్ల వయసులో ఆమె నిర్ణయించుకుంది. అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, బైకర్‌ ఇలా అనేక విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. 45ఏండ్ల వయసులో 2016 రియో పారాలింపిక్స్‌ షార్ట్‌పుట్‌లో దీపా మాలిక్‌ రజత పతకం సాధించారు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. మొత్తంగా తన కెరీర్‌లో దీపా మాలిక్‌ 58 జాతీయ, 23 అంతర్జాతీయ పతకాలు సాధించి, అత్యంత స్ఫూర్తిదాయక అథ్లెట్‌గా నిలిచారు. logo