బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 07, 2020 , 19:33:22

ఆసీస్‌ దశాబ్దపు వన్డే, టెస్టు జట్ల కెప్టెన్లుగా ధోనీ, విరాట్‌..

ఆసీస్‌ దశాబ్దపు వన్డే, టెస్టు జట్ల కెప్టెన్లుగా ధోనీ, విరాట్‌..

ఆసీస్‌ దశాబ్దపు వన్డే, టెస్టు జట్ల కెప్టెన్లుగా ధోనీ, విరాట్‌..

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఎ) ఈ దశాబ్దానికి గానూ తమ టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. రెండు జట్లకు కెప్టెన్లుగా భారత క్రికెట్‌ దిగ్గజాలు ఎం.ఎస్‌. ధోని, విరాట్‌ కోహ్లిలను ఎన్నుకోవడం విశేషం. వన్డే జట్టుకు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన సీఏ.. టెస్టు జట్టుకు రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లిని ఎన్నుకుంది. రెండు ఫార్మాట్లకు ఇద్దరు భారత ఆటగాళ్లను కెప్టెన్లుగా ఎంపిక చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఈ దశాబ్దంలో వారి ప్రదర్శన, జట్టు ప్రదర్శన ఆధారంగా ఈ గౌరవస్థానాన్ని కట్టబెట్టింది.


టెస్టు జట్టుకు విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌గా ఎన్నుకున్న సీఏ.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మాత్రం అతని రెగ్యులర్‌ స్థానాన్ని మార్చింది. కోహ్లికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో స్థానం కల్పించింది. ఓపెనర్లుగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ఆలిస్టర్‌ కుక్‌తో పాటు డేవిడ్‌ వార్నర్‌ను ఎంపిక చేసింది. మూడో స్థానంలో న్యూజీలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, నాలుగో స్థానంలో ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఎన్నుకున్న సీఏ.. వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికా గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ను ఎన్నుకుంది. ఏడో స్థానానికి గాను ఇంగ్లాండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, బౌలర్లుగా డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, నాథన్‌ లియాన్‌లకు చోటు కల్పించింది. 12వ ఆటగాడిగా లియాన్‌కు జోడీగా ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కాగా, ఈ జట్టులో అత్యధికంగా ఇంగ్లాండ్‌ నుంచి నలుగురు, ఆసీస్‌ జట్టు నుంచి ముగ్గురు, ఇండియా, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు చొప్పున టీంలో చోటు దక్కించుకోగా, అత్యల్పంగా న్యూజిలాండ్‌ నుంచి ఒక్కరికి ఈ జట్టులో చోటు దక్కింది.

వన్డే జట్టుకు ధోనికి సారథ్య భాద్యతలు అప్పగించిన సీఎ.. భారత్‌ నుంచి ధోనితో పాటు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు కల్పించింది. ఆసీస్‌ నుంచి మిచెల్‌ స్టార్క్‌కు మాత్రమే స్థానం కల్పించింది సీఏ. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్‌ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌, బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్‌, ఇంగ్లాండ్‌ నుంచి జోస్‌ బట్లర్‌, న్యూజిలాండ్‌ నుంచి ట్రెంట్‌ బౌల్ట్‌, ఆఫ్ఘానిస్థాన్‌ నుంచి రషీద్‌ ఖాన్‌, శ్రీలంక నుంచి మలింగ జట్టులో చోటు దక్కించుకున్నారు.

సీఏ దశాబ్దపు టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అలిస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌(వికెట్‌ కీపర్‌), బెన్‌స్టోక్స్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లియాన్‌, జేమ్స్‌ అండర్సన్‌.

సీఏ దశాబ్దపు వన్డే జట్టు: ఎం.ఎస్‌. ధోని(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగా.logo