సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 17:33:04

యువ ఆటగాళ్లకు ధోని క్రమశిక్షణ నేర్పుతాడు : డీన్ జోన్స్‌

యువ ఆటగాళ్లకు ధోని క్రమశిక్షణ నేర్పుతాడు : డీన్ జోన్స్‌

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై జట్టుకు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. తరువాత జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రైనా ఈ ఏడాది జట్టు నుంచి వైదొలిగాడు. ఆ తరువాత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తాను ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. దీంతో జట్టు వారి స్థానాలను భర్తీ చేసే విషయమై జట్టు తర్జనభర్జనలు పడుతోంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను కెప్టెన్‌ ధోని కూల్‌గా హ్యాండిల్‌ చేస్తాడని ఫ్రాంచైజీ యాజమాన్యంతో పాటు మాజీ క్రికెటర్లు కూడా చెప్పుకొస్తున్నారు. 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ ఇదే విషయమై మాట్లాడుతూ చెన్నై టీమ్‌లోని ఆటగాళ్లలో ఇప్పటికే కెప్టెన్ ధోనీ ధైర్యంతో పాటు స్పూర్తిని నింపి ఉంటాడన్నాడు. జట్టు సభ్యులకు క్రమశిక్షణను కూడా క్యాంపు శిక్షణలో ధోని నేర్పించి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ధోని నాయకత్వంలోని సీఎస్‌కే ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ గెలువగా.. 12 సీజన్లలో ప్రతిసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. గతేడాది ముంబై చేతిలో కేవలం ఒక్క పరుగుతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కప్పును చేజార్చుకుంది. 

ధోనీ కెప్టెన్సీ గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో డీన్ జోన్స్ మాట్లాడుతూ ‘‘ధోనీ కెప్టెన్ కూల్. అతడు క్రికెట్‌ ఆడి 14 నెలలు అయ్యింది. అయినప్పటికీ జట్టులోని యువ ఆటగాళ్లందరికీ క్రమశిక్షణతో ఎలా మెలగాలో ధోనీ నేర్పించి ఉంటాడు. బ్యాట్స్‌మెన్‌గానూ ధోనీ చాలా క్రమశిక్షణతో మెలుగుతాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి తప్పు చేసే వరకూ ఆగి తరువాత పక్కా ప్రణాళికలు రచిస్తాడు. ధోనీ సాధించిన ఘనతల్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. భారత్ ఆల్‌టైమ్ టాప్5 ప్లేయర్లలో ధోనీ కచ్చితంగా ఉంటాడు’’ అని డీన్ జోన్స్ వెల్లడించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo