మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 14:51:55

"సీఎస్‌కేకు ధోనీయే పెద్ద బ‌లం"

చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోని ప్రభావవంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడ‌ని, జ‌ట్టుకు ధోనీనే పెద్ద బ‌లం అని మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎంఎస్ ధోని 2019 ప్రపంచ కప్ త‌రువాత మ‌ళ్లీ క్రికెట్ ఆడలేదు. 39 ఏండ్ల ధోని ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. సెప్టెంబర్ 19న అబుదాబిలో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగే ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్‌లో ధోని నాయ‌క‌త్వంలో సీఎస్‌కే బ‌రిలోకి దిగ‌నుంది. ఏడాది  విరామం త‌రువాత ఎంఎస్ ధోని గ్రౌండ్‌లో ఎలా ఆడ‌తాడా అనేది సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇదే విష‌య‌మై ఆకాశ్ చోప్రా త‌న యుట్యూబ్ చాన‌ల్‌లో మాట్లాడాడు. 

"ఎంఎస్ ధోని జట్టుకు అతిపెద్ద బలం. మొత్తం ఫ్రాంచైజీ అతడిపై ఆధారపడి ఉంది. అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆత్మ లాంటివాడు. అతడు ఉన్నంత‌కాలం సీఎస్‌కే బ‌తికే ఉంటుంది. ఎంఎస్ ధోని  గొప్ప కెప్టెన్, మంచి బ్యాట్స్‌మెన్‌. చాలా కాలం త‌రువాత క్రికెట్ ఆడ‌బోతున్నాడు. మైదానంలో పరుగులు తీయగలడా, గతంలో లాగా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డా అనే ప్ర‌శ్న‌లు అంద‌రిలో రేకెత్తుతున్నాయి. కానీ ఇక్క‌డ ఒక్క‌టి గుర్తుంచుకోండి. అతడు చాలా అనుభ‌వజ్ఞుడు. మెరుగ్గా రాణిస్తాడ‌ని నేను అనుకుంటున్నా" అని చోప్రా అన్నాడు. సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ జ‌ట్టులో లేక‌పోయినా వారికి మిచెల్ సాంట్నర్, ఇమ్రాన్ తాహిర్, కర్న్ శర్మ, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా వంటి మేటి స్పిన్న‌ర్లు ఉన్నార‌ని ఆకాశ్ అభిప్రాయ ప‌డ్డాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo