శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 12:02:54

ధావన్‌కు టెస్టుల్లో అవకాశం రాకపోవచ్చు : ఆకాశ్‌ చోప్రా

ధావన్‌కు టెస్టుల్లో అవకాశం రాకపోవచ్చు : ఆకాశ్‌ చోప్రా

గత కొన్నేళ్లుగా శిఖర్ ధావన్ భారతదేశానికి అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. ఓపెనర్‌గా టీమిండియా శిఖర్‌ స్థానంలో ఇతరులకు కూడా అవకాశం ఇవ్వలేదు. కెఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమా విహారీ, మురళీ విజయ్ వరకు భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అనేక మంది ఆటగాళ్లను ప్రయత్నించింది. కానీ ధావన్‌ లాగా నిలకడగా ఎవరు రాణించలేదనే చెప్పుకోవాలి

ధావన్ 34 టెస్టులు ఆడి ఇందులో అతను 7 సెంచరీలు చేశాడు. 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. కానీ 2018లో పేలవమైన ప్రదర్శన తరువాత, ధావన్ టెస్టులకు దూరమయ్యాడు. ఈ ఎడమచేతి బ్యాట్స్‌ మెన్‌ చివరిగా ఇంగ్లాండ్‌తో సెప్టెంబర్ 2018లో ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 34 ఏండ్ల ధావన్‌ను మళ్లీ భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం లభిస్తుందా అనేది ప్రశ్న? భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ఈ చర్చపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“ధావన్‌కు టెస్టుల్లో అవకాశం వస్తుందని నేను అనుకోను. టెస్టుల్లో ఓపెనర్లుగా ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వారు మెరుగ్గా రాణిస్తున్నారు కూడా. కాబట్టి శిఖర్‌ ధావన్‌కు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా అది ఇప్పట్లో జరుగదు’’ అని చోప్రా తన యూట్యూబ్ పేజీలోని ఒక వీడియోలో తెలిపారు.

‘‘ ధావన్‌ స్వతహాగా అద్భుతమైన వైట్‌బాల్‌ ఆటగాడు. టెస్టు కెరీర్‌ కూడా బాగానే ఉంది. కానీ అతను వన్డేలు, టీ-20లపై దృష్టి పెట్టాలి. టెస్టుల్లో ఇప్పటికే రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా కూడా వీరికి ప్రత్యామ్నాయంగా బాగానే ఆడుతున్నారు. కాబట్టి భవిష్యత్‌లో శిఖర్‌ ధావన్‌కు టెస్టుల్లో అవకాశం లభించకపోవచ్చు’’ అని ఆకాశ్‌ చెప్పుకొచ్చారు. 

ఆకాశ్‌ చోప్రా 10 టెస్ట్ మ్యాచులు ఆడారు. 23 సగటుతో 437 పరుగులు చేశాడు. 2004లో పాకిస్తాన్‌ వెళ్లిన భారత జట్టులో ఆకాశ్‌చోప్రా కూడా ఉన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo