అహ్మదాబాద్: పకడ్బందీ బౌలింగ్‌కు.. ప్లానింగ్‌తో కూడిన బ్యాటింగ్ తోడవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. కొత్త కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా.. ఢిల్లీ బౌలర్లలో రబడ మూడు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ధవన్ (69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (39) రాణించారు. మయాంక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మయాంక్ మ్యాజిక్..
అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన మయాంక్ దుమ్మురేపాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. ఆఖర్లో గేర్ మార్చి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. ప్రభ్‌సిమ్రన్ (12), గేల్ (13) ఎక్కువసేపు నిలువ లేకపోగా.. మలన్ (26) అండతో మయాంక్ రెచ్చిపోయాడు. 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అగర్వాల్.. ఇషాంత్ ఓవర్లో 4,6, అవేశ్ వేసిన చివరి ఓవర్లో బౌండరీలు కొట్టి 99 నాటౌట్‌గా నిలిచాడు. ఆడుతూ పాడుతూ.. ధవన్, పృథ్వీ షా బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ 63/0తో నిలిచింది. బ్రార్ తొలి బంతికే పృథ్వీని ఔట్ చేసినా.. స్మిత్ (25)తో కలిసి ధవన్ లక్ష్యాన్ని కరిగించాడు. స్మిత్ ధాటిగా ఆడలేకపోయినా.. పంత్ (14), హెట్‌మైర్ (16 నాటౌట్) విరుచుకుపడటంతో 14 బంతులు మిగిలుండగానే ఢిల్లీ విజయం సాధించింది.
స్కోరు బోర్డు
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ (సి) స్మిత్ (బి) రబడ 12, మయాంక్ (నాటౌట్) 99, గేల్ (బి) రబడ 13, మలన్ (బి) అక్షర్ 26, హుడా (రనౌట్) 1, షారుక్ (సి) హెట్‌మైర్ (బి) అవేశ్ 4, జోర్డాన్ (సి) లలిత్ (బి) రబడ 2, బ్రార్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 166/6. వికెట్ల పతనం: 1-17, 2-35, 3-87, 4-88, 5-129, 6-143, బౌలింగ్: ఇషాంత్ 4-1-37-0, స్టొయినిస్ 1-0-6-0, రబడ 4-0-36-3, అవేశ్ 4-0-39-1, లలిత్ 3-0-25-0, అక్షర్ 4-0-21-1.
ఢిల్లీ: పృథ్వీ (బి) బ్రార్ 39, ధవన్ (నాటౌట్) 69, స్మిత్ (సి) మలన్ (బి) మెరెడిత్ 25, పంత్ (సి) మయాంక్ (బి) జోర్డాన్ 14, హెట్‌మైర్ (నాటౌట్) 16, ఎక్స్‌ట్రాలు: 4 మొత్తం: 167/3. వికెట్ల పతనం: 1-63, 2-111, 3-147, బౌలింగ్: మెరెడిత్ 3.4-0-36-1, షమీ 3-0-37-0, రవి 4-0-42-0, జోర్డాన్ 2-0-21-1, బ్రార్ 3-0-19-1, హుడా 2-0-11-0.