సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 23:09:22

చెన్నైపై ఢిల్లీ ఘనవిజయం

చెన్నైపై ఢిల్లీ ఘనవిజయం

దుబాయ్‌:  ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఢిల్లీ  44 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది.  ఢిల్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందగా..చెన్నై వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.    బౌలింగ్‌, బ్యాటింగ్‌లో ఇరగదీసిన ఢిల్లీ  జట్టు ముందు చెన్నై పూర్తిగా తేలిపోయింది.  176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(43: 35 బంతుల్లో 4ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పృథ్వీ షా(64: 43 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్‌)  దూకుడైన అర్ధశతకంతో రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది.  

లక్ష్య ఛేదనలో  చెన్నై  మరోసారి తేలిపోయింది.  ఆరంభంలో  ఢిల్లీ  పరుగులను నియంత్రించింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు  తక్కువ స్కోరుకే చెన్నై టాపార్డర్‌ పెవిలియన్‌ బాట పట్టింది.  ఐదో ఓవర్లో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌(14)ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌ పంపగా.. నోర్ట్జే వేసిన ఆరో ఓవర్‌ ఆఖరి బంతిని భారీ షాట్‌ ఆడిన మురళీ విజయ్(10)‌ మిడాన్‌లో  రబాడకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  డుప్లెసిస్‌ సంయమనంతో ఆడుతూ  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

మధ్యలో డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌ జోడీ  ఆదుకునే ప్రయత్నం చేసింది. 16వ ఓవర్లో నోర్ట్జే బౌలింగ్‌లో  జాదవ్‌ ఎల్బీడబ్లూగా ఔట్‌ కావడంతో చెన్నై ఓటమి ఖరారైంది.     డుప్లెసిస్‌    ఆఖర్లో వేగంగా ఆడే క్రమంలో రబాడ బౌలింగ్‌లో కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.   చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన  ధోనీ(15)  పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.  పేలవ షాట్లతో మరోసారి నిరాశపరిచాడు. డెత్‌ ఓవర్లలో ఢిల్లీ గొప్పగా బౌలింగ్‌ చేసింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది.   పృథ్వీ షా,  ధావన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆరంభంలో ఓపెనింగ్‌ జోడీ  చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన చేసింది.   షా తన బ్యాటింగ్‌తో ఆద్యంతం అలరించాడు.    శిఖర్‌ ధావన్‌(35), రిషభ్‌ పంత్‌(37 నాటౌట్‌),  శ్రేయస్‌ అయ్యర్‌(26) కీలక ప్రదర్శన చేశారు.  చెన్నై బౌలర్లలో పియూశ్‌ చావ్లా ఒక్కడే రెండు వికెట్లు తీయగా శామ్‌ కరన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.  ఆరంభంలో ఢిల్లీ జోరు చూస్తే స్కోరు 200 దాటేలా కనిపించినా గట్టిగా పుంజుకున్న చెన్నై ప్రత్యర్థి స్కోరు వేగానికి కళ్లెం వేసింది.   ఆఖర్లో  భారీ  హిట్టింగ్‌ చేయాలని ఢిల్లీ ప్రయత్నించినా..ధోనీ వారి వ్యూహాలకు చెక్‌ పెట్టాడు.  logo