శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 18:17:28

SRH vs DC: రహానె స్థానంలో పృథ్వీ షా?

SRH vs DC: రహానె స్థానంలో పృథ్వీ షా?

 దుబాయ్:‌  ఐపీఎల్‌-13లో మంగళవారం ఆసక్తికర పోరు జరగనుంది.   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి.  ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా  ఢిల్లీ బరిలో దిగుతుండగా..సీజన్‌ను గౌరవప్రదంగా ముగించాలని హైదరాబాద్‌ భావిస్తోంది. సన్‌రైజర్స్‌ దాదాపుగా ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగింది. 

గత మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ ...సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఢిల్లీ ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకున్నట్లే.  పంజాబ్‌తో పోరులో    చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయిన సన్‌రైజర్స్‌ తమ ప్లేఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. గత శనివారం   జరిగిన మ్యాచ్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌ను  కోల్‌కతా నైట్‌రైడర్స్‌  59 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం  తెలిసిందే.

వరుస ఓటములకు అడ్డుకట్టవేసి  గెలుపు బాటపట్టాలని ఢిల్లీ ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రహానె(గోల్డెన్‌ డక్) తీవ్రంగా నిరాశపరిచాడు. సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లాడిన రహానె కేవలం 25 పరుగులే చేశాడు.  ఓపెనర్‌గా సూపర్‌ఫామ్‌లో ఉన్న ధావన్‌కు మరో ఎండ్‌లో సహకరించే బ్యాట్స్‌మెన్‌  లేకపోవడంతో ఢిల్లీ ఆందోళన చెందుతోంది.  సీజన్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ తడబాటు కొనసాగుతోంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా హైదరాబాద్‌ జట్టు 8 పాయింట్లతో ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది.