మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 03, 2020 , 23:46:32

కోల్‌కతాపై ఢిల్లీ గెలుపు..మోర్గాన్‌ పోరాటం వృథా

కోల్‌కతాపై ఢిల్లీ గెలుపు..మోర్గాన్‌ పోరాటం వృథా

షార్జా: ఐపీఎల్‌-13లో  వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్రేక్‌ పడింది.  శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో  కోల్‌కతా   పరాజయం పాలైంది. ఆల్‌రౌండ్‌షోతో  అదరగొట్టిన ఢిల్లీ జట్టు కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  229 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బౌలర్ల ధాటికి తడబడిన   కోల్‌కతా   20 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(58: 35 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. ఆఖర్లో ఇయాన్‌ మోర్గాన్‌(44 :18 బంతుల్లో  1 ఫోర్‌, 5సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి(36: 16 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపులు మెరిపించినా గెలిపించలేకపోయారు.    బౌలర్లు  నోర్ట్జే(3/33), హర్షల్‌ పటేల్‌(2/34)    సహకరించడంతో  ఢిల్లీ సునాయాస విజయాన్ని అందుకుంది. 

కోల్‌కతా  ఓటమి ఖాయమని అనుకుంటుండగా,  ఇన్నింగ్స్‌ ఆఖర్లో మోర్గాన్‌, రాహుల్‌ త్రిపాఠి ఒక్కసారిగా టాప్‌గేర్‌లోకి వచ్చేశారు.  ప్రతీ బంతిని బౌండరీ బాదాలన్న కసితో దంచికొట్టారు.   స్టాయినీస్‌ వేసిన 17వ ఓవర్లో  రాహుల్ 6, 6 ,4, 6 బాది 24 పరుగులు రాబట్టాడు.  రబాడ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మోర్గాన్‌ వరుసగా మూడు సిక్సర్లు కొట్టగా త్రిపాఠి ఫోర్‌ బాదడంతో 23 రన్స్‌ వచ్చాయి.

కోల్‌కతా ఒక్కసారిగా మళ్లీ రేసులోకి రావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. నోర్ట్జే వేసిన 19వ ఓవర్లో మోర్గాన్‌ ఔటవడంతో ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది.  చివరి ఓవర్లో కేకేఆర్‌ విజయానికి 26 రన్స్‌ అవసరం కాగా స్టాయినీస్‌ వేసిన తొలి బంతికి  త్రిపాఠి ఫోర్‌ కొట్టాడు.  తర్వాతి బంతికే అతన్ని బౌల్డ్‌ చేసి  ఢిల్లీ శిబిరంలో ఆనందాన్ని నింపాడు స్టాయినీస్. 

అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన  ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో  నిర్ణీత ఓవర్లలో  4 వికెట్లకు 228 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(88 నాటౌట్‌: 38 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సర్లు ), పృథ్వీ షా(66: 41 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు ) మెరుపు అర్ధశతకాలతో రాణించారు. రిషబ్‌ పంత్‌(38: 17 బంతుల్లో 5ఫోర్లు,సిక్స్‌ ) హిట్టింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్‌(2/29) ఒక్కడే ఢిల్లీని కాస్త కట్టడి చేశాడు.