సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 18, 2020 , 00:50:16

తొలి టైటిల్‌ వేటలో నయా ఢిల్లీ

తొలి టైటిల్‌ వేటలో నయా ఢిల్లీ

   ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి ఇరువైపులా పదునున్న కత్తిలా కనిపిస్తున్నది. గతేడాది యువ ఆటగాళ్లతో ప్లేఆఫ్‌ చేరి ఆకట్టుకున్న ఆ జట్టుకు ఈసారి సీనియర్లు అశ్విన్‌, రహానే తోడవడంతో ఫేవరెట్లలో ఒకటిగా మారింది. యూఏఈ పిచ్‌లు కూడా ఫిరోజ్‌షా కోట్లా మైదానం పరిస్థితులకు దగ్గరగా ఉండడం  ఆ జట్టుకు కలిసివచ్చే అంశం. జట్టు నిండా హిట్టర్లు, బ్యాటింగ్‌ లైనప్‌లో డెప్త్‌.. యువరక్తం, అనుభమవాల మేళవింపు.. అశ్విన్‌, అమిత్‌ మిశ్రాతో కూడిన బలమైన స్పిన్‌ విభాగం, రికీ పాంటింగ్‌ దిశానిర్దేశంతో మునుపెన్నడూ లేని విధంగా ఎంతో పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తున్న ఢిల్లీ సమిష్టి పోరాటంతో టైటిల్‌ పట్టేస్తుందేమో చూడాలి. 

ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చాలా సీజన్లలో ఫేవరెట్‌గా బరిలోకి దిగినా 12 ఏండ్లలో కేవలం నాలుగు సార్లే నాకౌట్‌ దశకు చేరగలిగిన ఢిల్లీ జట్టు తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతూనే ఉన్నది. ఢిల్లీ డేర్‌డేవిల్స్‌గా ఉన్న పేరును గత సీజన్‌లో క్యాపిటల్స్‌గా మార్చిన ఆ జట్టు యాజమాన్యం హెడ్‌కోచ్‌గా ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ను తెచ్చి..  యువ ఆటగాళ్లపైనే భారం వేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా సహా భారత యువ స్టార్లు అదరగొట్టడంతో.. 2018లో పట్టిక చివరి స్థానంలో నిలిచిన ఆ జట్టు.. గతేడాది ప్లేఆఫ్స్‌(మూడో స్థానం)కు చేరి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సీజన్‌లో క్యాపిటల్స్‌ జట్టులోకి పంజాబ్‌ నుంచి సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, రాజస్థాన్‌ నుంచి బ్యాట్స్‌మన్‌ రహానే రావడంతో మరింత బలోపేతం అయింది. 

సుదీర్ఘ బ్యాటింగ్‌ లైనప్‌ 

  ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాళ్లు ఉండడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ సానుకూల అంశం కానుంది. ఓపెనర్లుగా భారత సీనియర్‌ శిఖర్‌ ధవన్‌, యువ స్టార్‌ పృథ్వీ షా బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత భారీ హిట్టర్లు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(స్ట్రయిక్‌ రేట్‌ 130పైగా), వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌(156కి పైగా) ఉండడంతో టాపార్డర్‌ భీకరంగా కనిపిస్తున్నది. ఇక ఆ తర్వాత యువ హిట్టర్‌ షిమ్రాన్‌ హిట్మైర్‌ బ్యాటింగ్‌కు దిగొచ్చు. ఆల్‌రౌండర్లు కిమో పాల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌ హిట్టింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న వారే. అశ్విన్‌కు సైతం బ్యాట్‌తో రాణించే సత్తా ఉంది. అయితే తుది జట్టులో రహానేకు స్థానం దక్కడం కష్టమే. కాగా అతడి సలహాలు యువకులకు  ఎంతో ఉపయోగపడతాయని మేనేజ్‌మెంట్‌  భావిస్తున్నది.  

పటిష్టంగా స్పిన్‌  

  గత సీజన్‌లో బ్యాటింగ్‌ ప్రధాన బలంగా ఉన్న క్యాపిటల్స్‌కు.. ఈసారి స్పిన్‌ ప్రధానాస్త్రం కానుంది. అమిత్‌ మిశ్రా(157వికెట్లు) మణికట్టు మ్యాజిక్‌కు అశ్విన్‌ వైవిధ్యం తోడవడంతో ఢిల్లీ స్పిన్‌ పటిష్టంగా కనిపిస్తున్నది. వీరితో పాటు అక్షర్‌ పటేల్‌ లెఫ్టార్మ్‌తో బంతిని తిప్పగలడు.  దక్షిణాఫ్రికా యంగ్‌ గన్‌ కగిసో రబాడ, సీనియర్‌ స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మతో కూడిన పేస్‌ విభాగం బలంగా కాకపోయినా పర్వాలేదనిపిస్తున్నది. డానియెల్‌ సామ్స్‌, సఫారీ యువ పేసర్‌ ఎన్‌రిచ్‌ నోర్జేల్లో ఒకరికి తుది జట్టులో చోటు ఉండనుంది. 


logo